వచ్చే నెల 4న నీట్ పరీక్ష
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:20 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మే 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
- జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు, 4,454 మంది అభ్యర్థులు
- వివరాలు వెల్లడించిన కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మే 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంవీఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాల అండ్ సైన్స్ బ్లాక్, డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ మోడల్ బేసిక్ హైస్కూల్, ఎంజేపీటీబీసీడబ్లూ రెసిడెన్సియల్ స్కూల్ (బాలికల), టీజీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 4,454 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, ఉదయం 11.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థుల హాల్ టికెట్, ఫొటో గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డులతో పాటు రెండు పాస్ ఫొటో సైజ్ ఫొటోలు, ఒక కార్డు సైజ్ ఫొటో తీసుకరావాలన్నారు. పరీక్ష ఓఎంఆర్ షీట్ విధానంలో ఉంటుందని, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేయాలన్నారు. శాంతి భద్రతల నిర్వహణకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు చేరుకొనేలా బస్సులను సకాలంలో ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సురేందర్, కేజీబీవీ అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 11:20 PM