ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నన్న.. నారాజ్‌!

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:13 PM

తానొవ్వక ఒకరిని నొప్పించక తన పని తాను చేసుకుంటూ వెళ్లే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డికి కోపం వచ్చినట్లుంది. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న ఆయన అంత సులభంగా తన అసంతృప్తిని బయటపెట్టరు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండానే తన అసంతృప్తిని వెల్లడిస్తుంటారు.

రెండు రోజుల కిందట గన్‌మెన్లు, ప్రభుత్వ వాహనం సరెండర్‌

సొంత వాహనంలోనే ప్రభుత్వ, వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు

గన్‌మెన్లను వదులుకోవడం గతంలోనూ ఆయనకు అలవాటే..

పార్టీ పదవుల విషయంలో నారాజ్‌ అయ్యారని జోరుగా ప్రచారం

క్రమశిక్షణ, సంస్థాగత పదవులు, నియోజకవర్గంలో పట్టు కోసమేనా?

తానొవ్వక ఒకరిని నొప్పించక తన పని తాను చేసుకుంటూ వెళ్లే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డికి కోపం వచ్చినట్లుంది. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న ఆయన అంత సులభంగా తన అసంతృప్తిని బయటపెట్టరు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండానే తన అసంతృప్తిని వెల్లడిస్తుంటారు. ప్రత్యక్షంగా అధిష్టానంతో విన్నవించుకోవడం ద్వారా గానీ, లేదా తన చర్యల ద్వారాగానీ అది కనిపిస్తుంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టు ద్వారా వచ్చిన కారు, గ న్‌మెన్లను తిప్పి పంపించారు. ఈ చర్య వనపర్తి నియోజకవర్గంలోని రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఇది దేనికి సంకేతమో తెలియడం లేదు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న పలుమార్లు ఇలా జరిగింది. ఇప్పుడు సాధారణంగా చేశారా లేకుండా ఎవరిపైనైనా అసంతృప్తిని వ్యక్తం చేయడానికా అనేది తేలాల్సి ఉంది.

మహబూబ్‌నగర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి నారాజ్‌ అయ్యారా? పార్టీ పదవుల విషయంలో ఆయన అలకబూనారా? ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తన నిరసనను ఎలా ప్రదర్శించాలో తెలియకనే స్తబ్దుగా ఉంటున్నారా? అంటే తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్‌ నేతల్లో చిన్నారెడ్డి టాప్‌ 10లో ఉంటారు. సోనియాగాంధీ నుంచి రాహుల్‌గాంధీ వరకు ఆయన సుపరిచితుడు. వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చిన్నారెడ్డి గత ఎన్నికల్లో టిక్కెట్‌ వచ్చి చివరి నిమిషంలో దక్కకుండా పోయింది. ఆ స్థానంలో తూడి మేఘారెడ్డి పోటీచేసి విజయం సాధించారు. తన సీనియారిటీని, పార్టీలో ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే ప్రగతి భవన్‌లో ప్రతీవారం నిర్వహించే ప్రజావాణి బాధ్యతలను కూడా అప్పగించారు. అప్పటి నుంచి తన కేడర్‌ కూడా బలం కూడదీసుకుంటోంది. చిన్నారెడ్డి, మేఘారెడ్డి బయటకు బాగానే ఉన్నట్లు కనిపించినా ఇద్దరూ నియోజకర్గంలో కలిసి పోవడం లేదనేది బహిరంగ రహస్యమే. గతంలోనూ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనల విషయంలో విభేదాలు బహిరంగాగానే కనిపించాయి. అయితే కొద్దికాలంగా నియోజకవర్గంలో చిన్నారెడ్డి ఎక్కువగా పర్యటించడం లేదు. వీరిద్దరి మధ్య ఏదైనా అధిష్టానం సయోధ్య కుదిర్చిందా అనేది తెలియదు కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వన్‌సైడ్‌గానే పార్టీని నడిపిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్ల పంపిణీ విషయంలో ఏవైనా విభేదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికైతే అంతగా విభేదాలు బయటపడటం లేదు. తనకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల్లో చిన్నారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు.

- పార్టీ పదవుల విషయంలోనేనా...?

చిన్నారెడ్డి ప్రస్తుతం ప్రభుత్వంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండగా పార్టీలో ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మొన్నటివరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్‌గా పనిచేశారు. అయితే క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా ఉన్న తనకు ఇంకా పదవీకాలం ఉండగానే మార్చారని చెప్పినట్లు ఆయన సన్నిహితులు కొందరు చెబుతున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీని సమర్థవంతంగా నిర్వహించారనే పేరు ఆయనకు ఉన్నది. ఈ విషయంలో అధిష్టానానికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో కీలకమైన ఈ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్‌గా డాక్టర్‌ మల్లు రవిని పార్టీ నియమించింది. దీని విషయంలో కొంత నారాజ్‌ అయినట్లు సమాచారం. అలాగే పార్టీలో సంస్థాగత పదవులు చాలా కీలకంగా ఉంటాయి. ఆయనను క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ నుంచి తప్పించిన తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమించారు. అయితే సంస్థాగత పదవులు కూడా దక్కడం లేదనే వాదన ఆయన వర్గం నుంచి వ్యక్తమవుతోంది. ఇటీవల అన్ని ఉమ్మడి జిల్లాలకు సంస్థాగత ఇన్‌చార్జిలను పార్టీ నియమించింది. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌కు ఖమ్మం, నల్గొండ బాధ్యతలు వచ్చాయి. రాష్ట్ర స్పోర్ట్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్న శివసేనారెడ్డికి రంగారెడ్డి బాధ్యతలను పార్టీ అప్పగించింది. అయితే చిన్నారెడ్డికి ఏదో ఒక జిల్లాను అప్పగిస్తే బాగుండేదని తన కేడర్‌ భావిస్తోంది. అయితే ఇటీవల ఆయన కేడర్‌కు చెందిన నందిమల్ల యాదయ్యకు టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ పదవి వచ్చింది. అయితే అనూహ్యంగా ఇంతకాలం గన్‌మెన్లను కొనసాగిస్తూ ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్న చిన్నారెడ్డి సరెండర్‌ చేయడంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పార్టీ పదవుల విషయంలోనే ఆయన నారాజ్‌ అయ్యారనే భావనకు బలం చేకూరుస్తున్నాయి.

- కుమారుడి కోసం ఆరాటం...

పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న చిన్నారెడ్డి తదుపరి తన కుమారుడు డాక్టర్‌ జిల్లెల ఆదిత్యారెడ్డిని నియోజకవర్గంలో కీలకంగా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌లో బాధ్యతల్లో ఉన్న ఆదిత్యారెడ్డి గత ఎన్నికల సమయంలోనూ నియోజకవర్గంలో తిరిగారు. అవకాశం వస్తే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బరిలో ఆదిత్యారెడ్డిని దించాలని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఇప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తన కేడర్‌లోని కొంతమంది చెబుతున్నారు. కానీ అంత సులభంగా అది వచ్చే పరిస్థితులు మాత్రం లేవని స్పష్టంగా తెలుస్తోంది. అనేకమంది ఈ పదవి ఆశలో ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్టు బిగిస్తుండగా తాను కూడా తిరిగి కీలకంగా కావడం కోసం తాపత్రయపడుతున్నట్లు సమాచారం. కుమారుడి రాజకీయ భవిష్యత్‌ను సరైన దిశలో పెట్టడం, తన కేడర్‌కు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా చిన్నారెడ్డి గన్‌మెన్లను సరెండర్‌ చేసిన సందర్భాలు ఉండగా ఇప్పుడూ ఆ కోవలోనే చేశారా? లేక పార్టీ పదవుల విషయంలో నారాజ్‌ కావడం వల్లే నిర్ణయం తీసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇదే విషయమై ఆయనను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jul 09 , 2025 | 11:13 PM