నల్లమలకు రాగానే గుండె ఉప్పొంగుతోంది
ABN, Publish Date - May 19 , 2025 | 11:11 PM
‘నల్లమల బిడ్డగా ఈ ప్రాంతానికి రాగానే నా గుండె ఉద్వేగానికి లోనవుతోంది. జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతా్‌పరెడ్డి, ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి మహేంద్రనాథ్ వంటి మహోన్నతమైన వారు ప్రాతినిధ్యం వహించారు. నల్లమల బిడ్డగా నేను సీఎం కావడం గర్వంగా భావిస్తున్నా’నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కోన్నారు.
నల్లమల బిడ్డగా సీఎం పీఠాన్ని అధిరోహించడం గర్వంగా భావిస్తున్నా
అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోనే రోల్ మోడల్‌గా చేస్తా
అమ్రాబాద్ మండలం మాచారం సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభం
నాగర్‌కర్నూల్/అచ్చంపేట/అమ్రాబాద్ మే 19( ఆంధ్రజ్యోతి): ‘నల్లమల బిడ్డగా ఈ ప్రాంతానికి రాగానే నా గుండె ఉద్వేగానికి లోనవుతోంది. జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతా్‌పరెడ్డి, ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి మహేంద్రనాథ్ వంటి మహోన్నతమైన వారు ప్రాతినిధ్యం వహించారు. నల్లమల బిడ్డగా నేను సీఎం కావడం గర్వంగా భావిస్తున్నా’నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కోన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి నల్లమలతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వెనుకబడిన వర్గాలు, మైనానిటీలకు వెన్నుదన్నుగా నిలిచిన చర్రిత ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు భూమి, భుక్తి దక్కిందంటే కాంగ్రెస్ వల్లనే సాధ్యమైందని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని అన్నారు. చెంచులు, గిరిజనుల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు నియోజకవర్గాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటున్నానని అన్నారు. మళ్లీ వచ్చే ఏడాది మే 19న మాచారానికి వస్తానని, అప్పటి వరకు వెనుకబడిన వర్గాలు కూడా ఆర్థికంగా బలపడేలా చేయూత అందించాలని అధికార యంత్రాంగానికి చెప్పారు. నల్లమలలోని అన్ని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, నివేదికను రూపొందించాలని అధికారులకు సూచించారు. అ టవీ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులకు సోలార్ పంపుసె ట్లు అందించాలని చెప్పా రు. 100 రోజుల్లో ప్రణాళికను పూర్తి చేయాలని, 100 శాతం సబ్సిడీపై నిధులు మంజూరు చేసే బాధ్యతను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు అప్పగించారు. ఐటీడీఏకు ఐఎఎస్ అధికారిని నియమించే విషయమై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.
నల్లమల డిక్లరేషన్‌ను పాటిస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నల్లమల డిక్లరేషన్‌ను తూచ తప్పకుండా నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. గిరిజన యువతకు జూన్ 2న రూ.1,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన ఈ రోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సుదినమన్నారు. వజ్రంలాంటి ముఖ్యమంత్రి, వజ్రాల్లాంటి మంత్రుల హృదయ అంతరాల్లో నుంచి ఈ పథకం ఉద్భవించిందన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి నాయక్వతంలో తెచ్చిన నల్లమల డిక్లరేషన్‌తో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి వంటి నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందవద్దని, ప్రజలకు పథకాలు అందవద్దని ప్రతిపక్షాలు ఏదో ఒక కట్ర చేస్తున్నాయన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఉమ్మడి కుంటుబాన్ని, అద్భుతమైన సమాజాన్ని నిర్మించబోతున్నామన్నారు. ప్రతీ పాఠశాలను 25 ఎకరాలలో రూ.200 కోట్లతో నిర్మించనున్నామమన్నారు. అందుకోసం మొదటి దశలోనే 104 పాఠశాలలకు రూ.11,600 కోట్లు మంజూరు చేశామన్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం పెంచామన్నారు.
నల్లమలలో ఎదిగి.. ఒదిగి సీఎం అయ్యారు : మంత్రి సీతక్క
నల్లమల ప్రాంతంలో పుట్టి, ఎదిగిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి, ప్రజల కోసం ఒదిగి పాలన అందిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఆదిమ జాతులకు ప్రత్యేక చట్టాలను చేయడం జరిగిందన్నారు. భూ సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా గత ప్రభుత్వంలో ఆదిమ జాతి ప్రజలు గుర్తుకు రాలేదన్నారు. నల్లమలలో పుట్టిన రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత సమస్యలు తెలుసు కాబట్టి, వారి అభివృద్ధి కోసం ఎంత ఖర్చయినా ఈ ప్రభుత్వం భరిస్తుందన్నారు. గతంలో ఐటీడీఏలో ఎన్నో శాఖలు ఉన్నా.. ప్రస్తుతం 3, 4 శాఖలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. 15 సంవత్సరాలు నిండిన చెంచు యువతులు మహిళా సంఘాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో వడ్డీ వ్యాపారుల దోపిడీ అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని మంత్రి చెప్పారు.
రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు: మంత్రి జూపల్లి కృష్ణారావు
గత పాలకులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెడితే తాము అవి తీర్చుకుంటూ, 16 మాసాల ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రజా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పోలీసుల చేతకొట్టించిన భూమిలోనే సోలార్ మోటార్లు పెట్టించాం: ఎంపీ మల్లు రవి
గత ప్రభుత్వ పాలనలో పోడు భూములను సాగు చేసిన రైతులను చెట్టుకు కట్టేసి కొట్టించారని, ఆ భూములోనే ప్రజా పాలన ప్రభుత్వం సోలార్ మోటార్లు పెట్టిందన్నారు. మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అది ఒర్వలేక ఏదో ఒకటి రాద్ధాతం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ సూచించారు.
వారిని కాపాడుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి దామోదర రాజనరసింహ
రాష్ట్రంలో ఉన్న దళితులను, ఆదిమ జాతులను కాపాడుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వారి హక్కులను రక్షించేది కూడా కాంగ్రెస్సేనన్నారు. ఇందిరమ్మ పాలనలో 25 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేసిందన్నారు. గత ప్రభుత్వం ధరణి తెచ్చి, పేదవాడి భూములను కొల్లగొట్టిందన్నారు. 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణను సుప్రీం కోర్టు సూచనల మేరకు తమ ప్రభుత్వమే మొదటిసారిగా అమలు చేసిందన్నారు.
పర్యాటక అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ
దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సాగునీరు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అప్పార్ ప్లాట్ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలని అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సభలో ఆయన సీఎంకు విన్నవించారు. మద్దిమడుగు వద్ద వంతెన నిర్మాణంతో పాటు నల్లమల్లలో పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. మన్ననూర్ ఐటీడీఏకు రెగ్యులర్ పీవోను, పూర్తి స్థాయిలో కార్యాలయ సిబ్బందిని నియమించాలన్నారు. నియోజకవర్గంలో పేదప్రజలు అధికంగా ఉన్నందున మరో 100 ఇందిరమ్మ ఇళ్లు అదనంగా మంజూరు చేయాలని, అమ్రాబాద్ మండలంలో 220/33 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని, బీకే తిర్మాలాపూర్, బీకే లక్ష్మాపూర్ గ్రామాలలో రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఆర్‌ఎ్‌ఫఓఆర్ ద్వారా పట్టాలు ఇప్పించాలని కోరారు. సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Updated Date - May 19 , 2025 | 11:11 PM