భూ భారతిపై పూర్తి అవగాహన ఉండాలి
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:16 PM
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి-2025 చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
మహబూబ్ నగర్ కలెకరేట్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి-2025 చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూభారతి భూమి హక్కుల రికార్డు-2025 చట్టంపై తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూ భారతి చట్టంలోని ముఖ్యంశాలను వివరించారు. ఏవైన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. న్యాయ సేవ సంస్థలు, ఇతర సంస్థలు, వ్యవస్థల ద్వారా పేదలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి, మహిళలకు ఉచిత న్యాయసహాయం, సలహాలు ఈ చట్టం ద్వారా అందించాలన్నారు. ముఖ్యంగా తహసీల్దార్లు చట్టంలోని ప్రతీ అంశంపై అవగాహన సాధించాలన్నారు. మ్యూటెషన్లు, జారీ చేసిన పాస్‌పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవో లేదా కలెక్టర్‌కు అప్పీలు చేసుకునేలా రెండు అంచెల అప్పీలు వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. వారసత్వంగా సంక్రమించే భూముల మ్యుటేషన్ల విషయంలో నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియపై సూచనలు చేశారు. ఈ నెల 17 నుంచి మండలాల వారిగా రైతులతో సమావేవాలు ఏర్పాటు చేసి, అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
మండలాల వారిగా అవగాహన కార్యక్రమాలు
ఈనెల 17న జడ్చర్ల, గండీడ్, 19న మహ్మదాబాద్, 21న అడ్డాకల్, మూసాపేట, 22న మిడ్జిల్, భూత్పూర్, 23న సీసీ కుంట, కౌకుంట్ల, 24న కోయిల్‌కొండ, హన్వాడ, 25న దేవరకద్ర, మహబూబ్‌నగర్ రూరల్, 26న మహబూబ్‌నగర్ అర్బన్, 28న నవాబ్‌పేట్, 28న బాలానగర్, 29న రాజాపూర్ మండలాలలో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Updated Date - Apr 16 , 2025 | 11:16 PM