పైలట్ ప్రాజెక్టుగా మూసాపేట
ABN, Publish Date - May 03 , 2025 | 11:16 PM
ప్రభుత్వం జిల్లాలో ఒక పైలట్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 5 నుంచి 13 వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించండతో.. జిల్లాలోని మూసాపేట మండలాన్ని ఫైలెట్ మండలంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
- ఈనెల 5 నుంచి 13 వరకు మండలంలో రెవెన్యూ సదస్సులు
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం జిల్లాలో ఒక పైలట్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 5 నుంచి 13 వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించండతో.. జిల్లాలోని మూసాపేట మండలాన్ని ఫైలెట్ మండలంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. మూసాపేట పైలెట్ మండలంలో అన్ని గ్రామాల్లో ఈనెల 5 నుంచి 13 వరకు షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెండు రెవెన్యూ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కో టీమ్‌లో ఏడుగురు రెవెన్యూ సిబ్బంది ఉంటారని తెలిపారు. ప్రతీ రోజు రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. 5న ఉదయం 10 నుంచి సాయంత్ర 4 గంటల వరకు శక్రాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, తుంకినీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, 6న జానంపేట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, వేముల గ్రామంలో రైతు వేదిక వద్ద, 7న పోల్కంపల్లి రైతు వేదికలో, సంకల్‌మద్ది రైతు వేదికలో, 8న కొమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, నందిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో, 9న మహమ్మద్‌హుసేన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, నిజాలపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, 12న తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం, దాసరపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో, 13న కనకాపూర్ ప్రాథమిక పాఠశాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తారని తెలిపారు. ఈ సదస్సులో భూ సంబంధిత పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, సరిహద్దు సమస్యలు, పార్ట్-బీలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు, పట్టాలేకుండా ప్రభుత్వ భూములు కబ్జా కలిగిన వివరాలు సేకరణ తదితర భూ సమస్యలను సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూ భారతి చట్టం ప్రకారం పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రభుత్వమే నిర్ణీత ప్రో ఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందచేయడం జరుగుతుదంని, రైతులు దరఖాస్తులను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి అధికారులకు అందజేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను భూ భారతి చట్టంతో పొందుపరిచిన నియమాల ప్రకారం పరిష్కరిస్తామని తెలిపారు.
Updated Date - May 03 , 2025 | 11:16 PM