మామిడి ఒరుగు.. సంపాదన మెరుగు
ABN, Publish Date - May 20 , 2025 | 11:27 PM
పల్లె జనానికి మామిడి ఒరుగు ఉపాధి చూపుతోంది. వేసవిలో దాదాపు రెండు నెలలు కడుపు నింపుతోంది. ఈ సీజన్‌లో సాధారణంగా గ్రామీణ ప్రజలు, ప్రధానంగా మహిళలు మామిడి పండ్లు విక్రయిస్తుంటారు.
- ఏపీ, కర్ణాటకల నుంచి కాయల దిగుమతి
- కోసి ఎండ బెట్టి, ఒరుగు చేసి ఎగుమతి
- పల్లె జనానికి రోజంతా కావలసినంత పని
- దాదాపు రెండు నెలల పాటు ఉపాధి
నవాబ్‌పేట, మే 20 (ఆంధ్రజ్యోతి) : పల్లె జనానికి మామిడి ఒరుగు ఉపాధి చూపుతోంది. వేసవిలో దాదాపు రెండు నెలలు కడుపు నింపుతోంది. ఈ సీజన్‌లో సాధారణంగా గ్రామీణ ప్రజలు, ప్రధానంగా మహిళలు మామిడి పండ్లు విక్రయిస్తుంటారు. తోటలు ఉన్న రైతులు కొందరు నేరుగా ప్రజలకు పచ్చడి కాయలు అమ్ముతుంటారు. మరికొందరు మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అందుకు భిన్నంగా మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల సరిహద్దు మండలాల్లో మామిడి ఒరుగు తయారు చేసి జీవనోపాధి పొందుతున్నారు.
ఒక వ్యక్తితో ప్రారంభం
ఒక వ్యక్తితో ప్రారంభమైన మామిడి ఒరుగు తయారీ ఇప్పుడు దాదాపు ఐదారు గ్రామాల్లో కొనసాగుతోంది. రుద్రారం గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ 12 ఏళ్ల క్రితం మామిడి ఒరుగు తయారీని ప్రారంభించాడు. అతడి స్ఫూర్తితో మరికొంత మంది ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇలా చుట్టుపక్కల గ్రామాల్లోనూ విస్తరించింది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో 10 నుంచి 15 మంది మామిడి ఒరుగు తయారు చేయిస్తున్నారు. ఒక్కో వ్యక్తి వద్ద దాదాపు 30 మహిళలు పని చేస్తారు. వారంతా మామిడి కాయలను కోసి ముక్కలు చేసి ఎండ పెట్టి ఒరుగు చేస్తున్నారు.
రూ. 50 వేల వరకు ఆదాయం
ఒరుగు తయారీకి అవసరమైన మామిడి కాయలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, అనంతపూర్, కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి వాటిని ముక్కలుగా కోసి ఎండబెట్టి ఒరుగు తయారు చేస్తారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు కూడా తల్లిదండ్రులతో కలిసి ఈ పనిలో నిమగ్నం అవుతారు. తమ చదువుకు, పుస్తకాల కొనుగోలుకు అవసరమైన డబ్బు సంపాదించు కుంటారు. ప్రస్తుతం రుద్రారం, రాంసింగ్ తండా, మరికల్, కన్మన్‌కాల్వ, కొత్తపల్లి తదితర గ్రామాల్లో మామిడి ఒరుగు తయారీ జోరుగా సాగుతోంది. గ్రామంలో ఎక్కడ చూసిన ఎండబెట్టిన ఒరుగు కనిపిస్తోంది. స్థానికంగా మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో ఒరుగును నిజమాబాద్ జిల్లాకు తీసుకెళ్లి విక్రయిస్తారు. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు, దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఇలా సీజన్ ముగిసే వరకు ఒక్కో మహిళ రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు సంపాదించుకుంటుంది.
ఉన్న చోటే ఉపాధి
ప్రతీ వేసవిలో మామడికాయల ఒరుగు తయారీతో మాకు ఉన్న చోటే పని దొరుకుతోంది. ఈ రెండు నెలల పాటు కష్టపడి పని చేసుకుంటాం. వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు, వ్యవసాయానికి ఉపయోగించుకుంటాం.
- అరుణమ్మ, రుద్రారం
ఇంటిల్లిపాదికీ పని
ఉపాధి పనులకు వెళ్తే సకాలంలో డబ్బు చేతికి రాదు. వంద రోజులు పూర్తయితే పని ఉండదు. కానీ ఒరుగు తయారీతో ఇంటిల్లిపాదికి పని ఉంటుంది. మా ఊర్లో చాలా మంది ఒరుగు తయారీతో లబ్ధి పొందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్నాం.
- పార్వతమ్మ, రుద్రారం
అందరూ ఆలోచించాలి
ఎవరో వచ్చి పని చూపిస్తారని అనుకోవద్దు. అందుబాటులో ఉన్న పనులపై దృష్టి సారించాలి. స్వయం ఉపాధి దిశగా ప్రతీ ఒక్కరికీ ఉపాధి లభిస్తోంది. ఈ సీజన్‌లో మామిడి ఒరుగు తయారీతో ప్రతీ ఒక్కరికీ పని దొరుకుతుంది. వచ్చే డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చు. పిల్లల చదువులకు ఖర్చు చేసుకోవచ్చు.
- నవీన్ గౌడ్, రుద్రారం
Updated Date - May 20 , 2025 | 11:27 PM