భూసమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:05 PM
భూభారతి చట్టం ద్వారా భూసమస్యలను మే మొదటి వారంలోపు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- భూభారతి పైలెట్ ప్రాజెక్టుపై రెవెన్యూ అధికారులతో సమీక్ష
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టం ద్వారా భూసమస్యలను మే మొదటి వారంలోపు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి కొత్త చట్టం అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 17 నుంచి 28 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వచ్చిన భూసమస్యల దరఖాస్తులపై మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్ అమలుకు రాష్ట్రంలో కేవలం నాలుగు మండలాలను ప్రభుత్వం ఎంపిక చేయగా అందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరు మండలం కూడా ఉంది. ఈనెల 17న ఆ మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. మద్దూరు మండలంలోని 17 గ్రామాల నుంచి భూసమస్యలపై మొత్తం 1,341 దరఖాస్తులు వచ్చాయని మద్దూరు తహసీల్దార్ మహేష్‌గౌడ్ కలెక్టర్‌కు తెలిపారు. సమస్యల తీవ్రతను బట్టి ఏ అధికారి స్థాయిలో పరిష్కారానికి అవకాశం ఉంటుందనే అంశంపై రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలంతో కలిసి కలెక్టర్ చర్చించారు. తహసీల్దార్‌కు సహకారంగా మరో ముగ్గురు కోస్గి, కొత్తపల్లి, సర్వే ల్యాండ్ ఏడీతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పైలెట్ మండలం లో చూపిన భూసమస్యల పరిష్కారాలే జూన్ 2 తరువాత నిర్వహించే రెవెన్యూ సదస్సులో భూసమస్యలకు కూడా వర్తిస్తాయని అందుకే ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో రాంచందర్‌నాయక్, భూభారతి ప్రత్యేకాధికారి యాదగిరి, సర్వే ల్యాండ్ ఏడీ గిరిధర్, మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్‌గౌడ్, జయరాములు, శ్రీనివాస్, డీటీ వాసుదేవరావు తదితరులున్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:05 PM