భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:13 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రైతుల చుట్టం అని, దీని ద్వార భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు.
- ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి
నవాబ్‌పేట, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రైతుల చుట్టం అని, దీని ద్వార భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నవాబ్‌పేటలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుకు కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి పాల్గొని, మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల హూములు కబ్జా చేసి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. రైతులకు పాస్ బుక్కులు కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. ఇకపై ఆధార్ కార్డు మాదిరి భూదార్ కార్డును ప్రభుత్వం అందజేస్తోందన్నారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసే అధికారం సీసీఎల్‌కు ఉంటాయని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని వివరించారు. పొరపాటున ఒకరి భూమి మరొకరికి నమోదైతే కలెక్టరుకు అప్పీలు చేసుకొని నిర్ణీత గడువులోనే పరిష్కారించుకోవాలని అభిప్రాయపడ్డారు. భూ భారతి చట్టంపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇకపై ప్రతీ సోమవారం మండల కేంద్రంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. అనంతరం కాకర్లపాడ్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి, తీగలపల్లి, ఇప్పోనిబావి గ్రామాల్లో జరిగిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీవో అనిల్‌కుమార్, తహసీల్దర్ శ్రీనివాస్, ఎంఈవో నాగ్యనాయక్, మార్కెట్ చైర్మన్ హరలింగం, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాంచంద్రయ్య, బంగ్ల రవి, వాజీద్ మహేక్, వాసుయాదవ్, దేపల్లి వెంకటేష్‌గౌడ్, భూపాల్‌రెడ్డి, హమిద్, నవాజ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజశేఖర్, కొల్లి నరసింహ, నీలకంఠం, సత్యం, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:13 PM