మహిళలకు న్యాయం జరగాలి : ఎస్పీ
ABN, Publish Date - May 29 , 2025 | 11:02 PM
పోలీస్‌స్టేషన్‌లకు మహిళలు రావడమే కష్టమని, మహిళలు స్టేషన్‌కు వచ్చారంటే ఎంతో ఇబ్బంది ఉంటే తప్ప రారని, అలాంటి మహిళలకు న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి పోలీసులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌స్టేషన్‌లకు మహిళలు రావడమే కష్టమని, మహిళలు స్టేషన్‌కు వచ్చారంటే ఎంతో ఇబ్బంది ఉంటే తప్ప రారని, అలాంటి మహిళలకు న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి పోలీసులను ఆదేశించారు. గురువారం నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ విజిట్ చేసి, స్టేషన్‌లోని కార్యకలాపాలు సమీక్షించారు. మహిళల భద్రత, న్యాయం, సేవల విషయాల్లో పారదర్శకత పాటించాలన్నారు. అనంతరం షీటీమ్‌తో మాట్లాడారు. ఈవ్ టీజింగ్, డొమెస్టిక్ వేధింపులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద నిఘా పెంచాలన్నారు. ప్రతి ఘటనను జాగ్రత్తగా రికార్డ్ చేసి బాధితులకు ఆత్మవిశ్వాసం కలిగేలా పనిచేయాలన్నారు. స్టేషన్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ శైలజ, షీటీం సిబ్బంది పాల్గొన్నారు.
చెక్ పోస్ట్ తనిఖీ
గోవుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు కోయిలకొండ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దులో 5 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 24/7 నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక చెక్ పోస్టులో పోలీసు, పశుసంవర్ధకశాఖ సిబ్బంది సమన్వయంతో షిప్టుల వారిగా పనిచేయాలని సూచించారు. అక్రమ రవాణా చేస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వన్‌టౌన్ సీఐ అప్పయ్య పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 11:02 PM