పాత్రికేయులు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూనే వార్తలు రాయాలి
ABN, Publish Date - May 29 , 2025 | 11:38 PM
పాత్రికేయులు నిత్యం ఙ్ఞానాన్ని పెంపొందించుకుంటూనే కొత్తదనంతో కూడిన వార్తలను వారివారి పత్రికల ద్వారా ప్రజల ముందుంచాలని, రాబోయే రోజుల్లో అంతా డిజిటల్ మీడియానే ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
- రాబోయే రోజుల్లో రానున్నది అంతా డిజిటల్ మీడియానే
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
మన్ననూర్, మే 29 (ఆంధ్రజ్యోతి) : పాత్రికేయులు నిత్యం ఙ్ఞానాన్ని పెంపొందించుకుంటూనే కొత్తదనంతో కూడిన వార్తలను వారివారి పత్రికల ద్వారా ప్రజల ముందుంచాలని, రాబోయే రోజుల్లో అంతా డిజిటల్ మీడియానే ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు అటవీ పర్యాటక వనమాలిక, ఆవరణలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో అటవీశాఖ సౌజన్యంతో రెండు రోజుల పాత్రికేయుల పునశ్చరణ తరగతులను గురువారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా జర్నలిజంలో ఎదురవుతున్న సమస్యలు, వర్తమానం వివిధ అంశాలపై తరగతులు బోధించారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేలా 10 పుస్తకాల కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణా తరగతులు నల్లమలలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడం శుభకరమని, శిక్షణల ద్వారా పాత్రికేయులు నాణ్యత కలిగిన వార్తలను ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాల ద్వారా ప్రజెంటేషన్ చేసే అవకాశం కల్గుతుందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చేలా పాత్రికేయులు నిత్యం వార్తలు అందిస్తే, ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించే ఆస్కారం ఉంటుందన్నారు. ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ డిజిటల్ మీడియా జర్నలిజం ఆవిష్కృతమైన వేళ పాత్రికేయ మిత్రులు నూతన విధానాలను అవలంభిస్తూ నిత్యం కొత్తకోణంలో ప్రజా సమస్యలను ప్రతిబింబించే ఆసక్తికరమైన వార్తలను రాయాలన్నారు. డిజిటల్ మిడియా అయినా, ప్రింట్ మీడియా అయినా వాస్తవాలు తెలుసుకొని ప్రజెంటేషన్ చేయాలన్నారు. అధునికంగా వస్తున్న గూగుల్, వాట్సాప్‌లను ఉపయోగించుకొని ఎక్స్‌క్లూజివ్ వార్తలు ఇస్తే ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక పేర ఆనాడు మొట్టమొదటి రాజకీయ సామాజిక పత్రిక నడిపించిన చరిత్ర గర్వించదగిన విషయమన్నారు. భాష తప్పొప్పులు, దిద్దుబాటు అనే అంశంపై విశాలాంధ్ర సంపాదకులు ఆర్‌వీ రామారావు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అర్థమయ్యే భాషలో వార్తా ప్రచురణ ఉండాలని, పత్రికలతో పాటుగా పుస్తకాలను తరచూ చదవడం, రాయడం వలన తెలుగు భాషపై పట్టు దొరుకుతుందని, అప్పుడే వార్తా కథనాల్లో తప్పులు దొర్లకుండా విలేకరులు వార్తలు రాయగలరన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, రాములు, తెలంగాణ మీడియా సిబ్బంది పూర్ణచందర్‌రావు, శనేశ్వర రెడ్డి, ఔస్‌డీ రహిమాన్ స్థానిక పాత్రికేయులు సాయిబాబ, ప్రభాకర్, వెంకటయ్య, శ్రీధర్, లక్ష్మీపతితో పాటుగా 90 మంది పాత్రికేయులు పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 11:38 PM