సాగుకు వేళాయే
ABN, Publish Date - May 25 , 2025 | 11:19 PM
ఈ సంవత్సరం తొలకరి వానలు ముందే కురవడంతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
- ముందే పలకరించిన తొలకరి
- వ్యవసాయ పనుల్లో రైతుల తలమునకలు
కోయిలకొండ, మే 25 (ఆంధ్రజ్యోతి) : ఈ సంవత్సరం తొలకరి వానలు ముందే కురవడంతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అడపా దడపా వర్షాలు కురవడంతో రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలైన జొన్న, కంది, వేరుశనగ, ఆముదం పంటలు సాగుకు మొగ్గు చూపుతున్నారు. రోహిణి కార్తెలో విత్తు నాటితే తెగెళ్లు రాకుండా పంట సమయానికి చేతికి వస్తోందని రైతులు భావిస్తారు. కాగా ఆదివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం అవుతుండడంతో రైతులు విత్తు నాటేందుకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పాటు వర్షా కాలంలో సాగు చేసే వరి పంటకు వరి తుకాలు రోహిణి కార్తెలో వేస్తారు. గత సంవత్సరం మండలంలో వర్షా కాలంలో 21 వేల ఎకరాల్లో వరి, 5 వేల ఎకరాల్లో పచ్చజొన్న, 3 వేల ఎకరాల్లో కంది, 51 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మండలంలో రెండు రోజల నుంచి 5 సెంటి మీటర్ల వర్షం కురవడంతో భూములు విత్తునాటేందుకు అనుకూలంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
శుద్ధి చేసిన విత్తనాలు వేయాలి
రైతులు వర్షాకాలంలో శుద్ధి చేసిన విత్తనాలు నాటాలి. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వరి, కందులు, మినుములు, పెసర్లు, వేరుశనగ విత్తనాలు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. 50 శాతం రాయితీతో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు పట్టాపాసు పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకొస్తే 30 కేజీల బస్తా రూ.2137 అందిస్తాం.
యామారెడ్డి, ఏవో, కోయిలకొండ
Updated Date - May 25 , 2025 | 11:19 PM