ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బిల్లులు ఇవ్వకుంటే.. మధ్యాహ్నం బంద్‌

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:20 PM

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం పెండింగ్‌ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు ఈ నెల 18లోపు చెల్లించాలని, లేదంటే వంట చేయబోమని నిర్వాహకులు అంటున్నారు.

దామరగిద్ద మండలం లోకుర్తి పాఠశాలలో వంట చేస్తున్న కార్మికులు(ఫైల్‌)

ఈ నెల 18 లోపు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

లేదంటే వంట చేయబోమంటున్న ఏజెన్సీ నిర్వాహకులు

నారాయణపేట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం పెండింగ్‌ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు ఈ నెల 18లోపు చెల్లించాలని, లేదంటే వంట చేయబోమని నిర్వాహకులు అంటున్నారు. జిల్లాలో 463 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 59,760 మంది విద్యార్థులకు గాను రోజుకు 50 వేల మంది భోజనం చేస్తున్నట్లు అంచనా ఉంది. భోజనం కోసం రోజుకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి వంట చేస్తున్నామని నిర్వాహకులు వాపోతున్నారు.

పెండింగ్‌ ఇలా..

ఉన్నత పాఠశాలలకు సంబంధించి తొమ్మిది, పది తరగతులకు అక్టోబరు నుంచి ఏప్రిల్‌ వరకు ఏడు నెలలు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి.

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

కోడి గుడ్ల బిల్లులు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు గత ఏడాదిలో ఐదు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

త్వరలో చెల్లిస్తాం

ఒకటి నుంచి 8వ తరగతి వరకు పెండింగ్‌ బిల్లులు రూ.కోటీ 80 లక్షలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వాటిని త్వరలోనే చెల్లిస్తామని అంటున్నారు. తొమ్మిది, పదో తరగతికి సంబంధించి సెప్టెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు రూ.కోటీ 37 లక్షలు నిధులు రాగా, అవి ఈకుబేర్‌లో ఉన్నాయని, త్వరలోనే విడుదల అవుతాయని చెబుతున్నారు. గుడ్ల బిల్లులకు సంబంధించి పాత బడ్జెట్‌ ముగియడంతో కొత్త బడ్జెట్‌ వచ్చిన తర్వాత రూ.74 లక్షలు వస్తాయని అంటున్నారు.

నిర్వాహకుల వేతనాలూ పెండింగ్‌

వంట ఏజెన్సీ నిర్వాహకుల వేతనాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఇచ్చే రూ.వెయ్యి అందుతున్నా, రాష్ట్రం నుంచి ఇచ్చే రూ.2 వేల వేతనం పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1,295 మంది వంట నిర్వాహకులు ఉన్నారు. వారికి కేంద్రం నుంచి మార్చి, జూన్‌ నెలలకు కలిపి ఒక నెల వేతనం రూ.12 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆరు నెలల వేనతం రూ.2 కోట్లా 10 లక్షలు ఈక్యుబేర్‌లో ఉన్నాయని, త్వరలో చెల్లిస్తామని అధికారులు అంటున్నారు.

19 నుంచి వంట బంద్‌

పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజనం బిల్లులు ఈ నెల 18లోపు చెల్లించకపోతే 19 తర్వాత పాఠశాలల్లో వంట చేయబోము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14 నెలలు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. తొమ్మిది, పదో తరగతులకు సంబంధించి వంట బిల్లులు 9 నెలలవి ఇవ్వాల్సి ఉంది.

- వెంకటమ్మ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, నారాయణపేట

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలి. వంట ఏజెన్సీలపై అధికారులు, పాలకుల వేధింపులు ఆపాలి.

- బాల్‌రామ్‌, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు, నారాయణపేట

Updated Date - Jun 15 , 2025 | 11:20 PM