ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు
ABN, Publish Date - Jun 01 , 2025 | 11:37 PM
ఆయిల్ పామ్ పంట సాగు రైతుకు అధిక లాభాలు తెస్తున్నాయి.
- చిన్నకారు రైతులకు ప్రోత్సాహం
- నూతన సాగుకు దరఖాస్తులు
కోయిలకొండ, మే 31 (ఆంధ్రజ్యోతి) : ఆయిల్ పామ్ పంట సాగు రైతుకు అధిక లాభాలు తెస్తున్నాయి. దీంతో ఆరుతడి పంటలైన ఆయిల్ పామ్‌ను పెంచేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయిల్ పామ్ మొక్క నాటిన 4 సంవత్సరాలకు క్రాప్ ప్రారంభమవుతోంది. దీంతో మండలంలోని 294 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా, మండలంలోని గార్లపాడ్, అయ్యవారిపల్లిలో ఆయిల్ పామ్ క్రాప్‌కు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ పామ్ పంట 25 నుంచి 30 సంవత్సరాలు రైతుకు క్రాప్ అందిస్తోందని ఉద్యానవన అధికారులు తెలిపారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానకి ప్రభుత్వం ఐదెకరాల్లోపు రైతులకు 90 శాతం, ఐదెకరాలు దాటిన రైతులకు 80 శాతం రాయితీ అందిస్తోంది. దీంతో పాటు తోటలు ప్రారంభించిన నాటి నుంచి ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్లకు రూ.16,800 ప్రభుత్వం రైతుకు ప్రోత్సాహం సైతం అందిస్తోంది. దీంతో పాటు పంటకు నీరు అందించేందుకు డ్రిప్ కోసం ఎస్సీ, ఎస్టీకి వందశాతం, బీసీ, చిన్నకారు, ఓసీ రైతులకు 90 శాతం రాయితీతో అందిస్తున్నారు. మండలంలోని గార్లపాడ్‌కు చెందిన రైతు సుధాకర్‌రెడ్డి ఆయిల్ పామ్ తోట క్రాప్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 17 టన్నుల వరకు ప్రీ యూనిక్ కంపెనీకి పంటను విక్రయించారు. ఆయిల్ పామ్ గింజలకు కేంద్రం ప్రభుత్వం టన్నుకు రూ.20,050 కేటాయించడంతో కంపెని వారు రైతుల వద్ద నుంచి అదే ధరతో కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు రైతులు ఆయిల్ పామ్ తోటతో పాటు వాటి మధ్య అంతర్‌పంటలు సాగు చేసి లబ్ధి పొందుతున్నారు.
జిల్లాలో మరో 1500 ఎకరాలు
2025-26 సంవత్సరానికి జిల్లాలో నూతనంగా 1500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు పెంపకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జడ్చర్లలో 550 ఎకరాలు, దేవరకద్రలో 550 ఎకరాలు, మహబూబ్‌నగర్‌కు 400 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి లక్ష్యం కేటాయించింది. దీంతో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి రైతులు దరఖాస్తులు చేసుకొంటున్నారు.
స్వప్న, ఉద్యానవన అధికారి
Updated Date - Jun 01 , 2025 | 11:37 PM