నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:00 AM
ధాన్యం కొనుగోలులో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
- అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యం
- లక్ష్యం 1.75 లక్షల మెట్రిక్ టన్నులు
- ఇప్పటికీ కొన్నది 1007 మెట్రిక్ టన్నులు
- అకాల వర్షానికి భయపడుతున్న రైతులు
- ప్రైవేటుకు తరలించి విక్రయాలు
- మద్దతు ధర, బోనస్ కోల్పోతున్న అన్నదాతలు
గద్వాల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు సమీక్షించినా ఫలితం లేకుండా పోతున్నది. కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందని రైతులు భయపడుతున్నారు. దీంతో వచ్చిన కాడికి అంటూ.... వ్యవసాయ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడ వారికి మద్దతు ధర లభించకపోగా బోనస్‌ను కోల్పోతున్నారు.
45 కేంద్రాలు మాత్రమే ప్రారంభం..
జిల్లాలో ధాన్యం సేకరణకు 69 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 45 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. ఇందులో కూడా కొన్ని కేంద్రాలలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1007 మెట్రిక్ టన్నులను మాత్ర మే కొనుగోలు చేశారు. దాదాపు 2.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రత్యేక అవసరాలు, ఇతర మార్కెట్లకు పోను 1.75లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఆమేరకు వారు కొనుగోళ్లను పెంచడం లేదు. జిల్లాలో సక్రమంగా ధాన్యం కేటాయించేందుకు 37మిల్లులు మాత్ర మే ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. ఆ మేరకు వానకాలంలో అగ్రి మెంట్ చేసుకున్నారు. యాసంగిలో కూడా ఆ మిల్లుల యజమానులతో అగ్రిమెంటు చేసుకుంటామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 17రైస్ మిల్లుల యజమానులతో మాత్రమే అగ్రిమెంటు చేసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు పుంజుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిచిపోతుందనే భయంతో ప్రైవేటు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. గద్వాల వ్యవసాయ మార్కెట్ ప్రతీ రోజు 3,500లకు పైగా సంచుల సన్నధాన్యం వస్తుంది. క్వింటా గరిష్టంగా రూ.2100 కనిష్టంగా రూ.1950వరకు లభిస్తుంది. రైతులు మద్దతు ధరతో పాటు బోనస్‌ను కోల్పోతున్నారు. అంటే క్వింటాకు దాదాపుగా రూ.700ల నుంచి రూ.850ల వరకు రైతులు నష్టపోతున్నారు.
Updated Date - Apr 25 , 2025 | 12:00 AM