ముచ్చటగా మూడోసారి
ABN, Publish Date - May 13 , 2025 | 11:09 PM
ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. 2020 ఆగస్టులో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. రాయితీ ఇవ్వడం వల్ల దరఖాస్తుదారులు ముందుకు వస్తారని ఆశించినా, వారి నుంచి ఆసక్తి కరువైంది.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు ఈనెలాఖరు వరకు పొడిగింపు
పురపాలికల్లో మందకొడిగా సాగుతున్న చెల్లింపులు
ఉమ్మడి పాలమూరులో 2.04 లక్షల దరఖాస్తులు
ఇప్పటి వరకు 39,944 అర్జీలకే ఫీజు చెల్లింపు
ఇంకా 80 శాతం పెండింగ్‌లోనే..
మహబూబ్‌నగర్,మే13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. 2020 ఆగస్టులో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. రాయితీ ఇవ్వడం వల్ల దరఖాస్తుదారులు ముందుకు వస్తారని ఆశించినా, వారి నుంచి ఆసక్తి కరువైంది. దాంతో ప్రభుత్వం ఇచ్చిన గడువును పొడిగిస్తూ పోతోంది. ముందుగా మార్చి 31 నాటికి చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని ప్రకటించగా, అప్పటికీ 10 శాతం దరఖాస్తులు కూడా రాకపోవడంతో గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. అయినా స్పందన అంతంతే ఉండటంతో ఈనెలాఖరు అంటే మే 31 వరకు ముచ్చటగా మూడోసారి గడువు పెంచింది. ఈ సారి కూడా నాలుగోవంతు దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేవలం రూ.70 కోట్ల ఆదాయం
ఉమ్మడి పాలమూరులోని 20 మునిసిపాలిటీలు, ఓ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2,04,213 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వాటి నుంచి కనీసం రూ.500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించగా, ఈనెల 13 వరకు కేవలం రూ.70.74 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 39,944 దరఖాస్తులకు మాత్రమే ఫీజులు చెల్లించారు. అంటే ఇప్పటివరకు కేవలం 19.55 శాతం దరఖాస్తులు మాత్రమే క్లియర్ అయ్యాయి. మొత్తం దరఖాస్తులకు ఫీజులు చెల్లిస్తే మరో రూ.300-400 కోట్ల ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్, వనపర్తి, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కొత్తకోట, కల్వకుర్తి, నారాయణపేట మునిసిపాలిటీల్లో మాత్రమే కొంత ఆదాయం సమకూరింది. పలు మునిసిపాలిటీలో నామమాత్రపు దరఖాస్తులకు ఫీజులు చెల్లించారు.
మూడు నెలలు గడివిచ్చినా
ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చినా దరఖాస్తుదారుల్లో ఆసక్తి లేకపోవడం గమనార్హం. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు చూపిన ఉత్సాహం ఫీజులు చెల్లించి, క్రమబద్దీకరణ చేసుకోవడంలో కనిపించడం లేదన్న విషయం స్పష్ఠమవుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అధికార యంత్రాంగం తేల్చలేకపోతోంది. గడువు మాత్రమం పొడగిస్తూ పోతున్నారు. అసలు దరఖాస్తు చేసుకున్న లేఅవుట్‌లపై విచారణ చేయిస్తే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి. వీటిలో చాలావరకు ఇదివరకే దొంగచాటున క్రమబద్దీకరణ చేసుకున్నారని, అందుకే ప్రభుత్వం ఎన్ని అవకాశాలిచ్చినా దరఖాస్తు దారులు ముందుకు రావడం లేదన్న విమర్శలు లేకపోలేదు. దీనిపై యంత్రాంగం సీరియ్‌సగా దృష్ఠి సారిస్తే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.
Updated Date - May 13 , 2025 | 11:10 PM