దిద్దుబాటుపై దృష్టి
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:20 PM
మహబూబ్‌నగర్, నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలపై జాతీయ వైద్య మండలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు లోపాలున్నాయని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొత్త, పాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ముగ్గురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఉన్నతాధికారులతో కమిటీ
నేడు మహబూబ్‌నగర్, రేపు నారాయణపేట కళాశాలల్లో తనిఖీలు
30 వరకు నివేదిక సమర్పించాలని గవర్నమెంట్ ఆదేశాలు
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం), జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్, నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలపై జాతీయ వైద్య మండలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు లోపాలున్నాయని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొత్త, పాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలోని కళాశాలల్లో లోపాలను అధ్యయనం చేసేందుకు ముగ్గురు ఐఏఎస్‌లు, మరో ఇద్దరు ఉన్నతాధికారులు కలిపి మొత్తం 5 మందితో ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు శుక్రవారం మహబూబ్‌నగర్, శనివారం నారాయణపేట మెడికల్ కళాశాలలను తనిఖీ చేయనున్నారు. అధ్యయనం చేసిన తర్వాత ఈనెల 30 వరకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్‌ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలు చాలా ఉన్నాయని జాతీయ వైద్య మండలి తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేసింది. ఆయా లోపాలపై షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ కళాశాలల్లో లోపాలను సరిచేసి, ఎంసీఐకి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈనెల 16న అన్ని జిల్లాల కళాశాల ప్రిన్సిపాల్స్, అధికారులతో హైదరాబాద్ లోని డీఎంఈ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ లోపాలను సరిదిద్దుకునేందుకు పూర్తి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అధ్యయనం చేసేందుకు ఐఏఎ్‌సలతో కమిటీ..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న లోపాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు టీజీసాక్స్ పీడీ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, టీజీఎంఎ్‌సఐడీసీ సీఈ రవీందర్, మహబూబ్‌నగర్ వైద్యకళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్ ఉన్నారు.
నేడు, రేపు కళాశాలల్లో అధ్యయనం..
ఆయా కళాశాలల్లో ఎంసీఐ గుర్తించిన లోపాలతో పాటు మరిన్ని సమస్యలను అధ్యయనం చేసేందుకు శుక్ర, శని వారాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ వైద్యకళాశాల, ఆసుపత్రి, శనివారం నారాయణపేట వైద్య కళాశాల, ఆసుపత్రిలలో కమిటీ తనిఖీలు చేయనుంది. ఈ కమిటీ కళాశాల, ఆసుపత్రిలో మంజూరైన పోస్టులు, పని చేస్తున్న ఫ్యాకల్టీ, ఖాళీలు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు?, ఇంకా ఎంతమందిని ఏయే నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ చేయాలనే అంశాలను కూడా అధ్యయనం చేయనున్నారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, నిర్మాణాలు, బడ్జెట్ వ్యవహారాలు, పడకలు, సీట్ల కేటాయింపులు, డాక్టర్లు, సిబ్బంది హాజరు, ఆరోగ్యశ్రీ కేసులు, ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, వినియోగం, వంటి ప్రతీ అంశంపైనా అధ్యయనం చేయనున్నారు. ఆ నివేదికను ఈనెల 30న సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లోపాలపై అధ్యయనం..
జాతీయ వైద్య మండలి ముఖ్యంగా 5 లోపాలను గుర్తించింది. ఇందులో వసతులు, ఫ్యాకల్టీ, పడకలు, ఆపరేషన్ థియేటర్ల లేమిని గుర్తించింది. మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాల నుంచి ఈ ఏడాది పదో బ్యాచు 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. 200 సీట్లకుగాను ఫ్యాకల్టీ(ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు) 232 మంది ఉండాలి. కానీ 129 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు మొత్తం 115 మంది ఉండాలి. కానీ కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు. దీంతోపాటు 770 పడకలకు గాను 710 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఖాళీగా ఉన్నాయి. మేజర్ ఆపరేషన్ థియేటర్లు 10కి గాను 8, మైనర్ ఆపరేషన్ థియేటర్లు 5కు గాను 3 ఉన్నాయి. కెడావర్(శవాలు) 18 ఉండాల్సి ఉండగా, 12 మాత్రమే ఉన్నాయి. హిస్టోఫాథాలజీ పరీక్షలు కూడా తక్కువగా చేశారు. అదేవిధంగా నారాయణపేట మెడికల్ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 50 సీట్లకు 95 మంది ఫ్యాకల్టీ ఉండాలి. కానీ 38 మంది మాత్రమే పని చేస్తున్నారు. 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా 200 పడకలకు గాను 100 పడకలే ఉన్నాయి. మేజర్, మైనర్ ఆపరేషన్ థియేటర్లు 10కి గాను 4 మాత్రమే ఉన్నాయి. కెడావర్లు(శవాలు) 5కు గాను 2 మాత్రమే ఉన్నాయి.
Updated Date - Jun 26 , 2025 | 11:20 PM