ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగ్రహ జ్వాల

ABN, Publish Date - Jun 04 , 2025 | 10:55 PM

జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ రణరంగంగా మారింది. ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమం ఆగ్రహ జ్వాలగా మారింది. కంపెనీకి చెందిన కంటెయినర్‌, గుడారానికి నిప్పు పెట్టిన నిరసనకారులు.. బొలేరో, ఎర్త్‌మూవర్‌ను ధ్వంసం చేశారు.

కంటెయినర్‌కు నిప్పు పెడుతున్న నిరసనకారుడు

రణరంగంగా మారిన ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం

పనుల ప్రారంభానికి వ్యతిరేకంగా కంటెయినర్‌, గుడారానికి నిప్పు

గ్రామస్థులు, కంపెనీ సిబ్బందికి గాయాలు, పోలీసుల లాఠీచార్జి

గత ప్రభుత్వంలో అనుమతులు, సమీప గ్రామస్థుల అభ్యంతరం

గతంలోనూ నిరసనలు, ఆ సమయంలో పనులు నిలిపివేసిన కంపెనీ

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా పనులు చేపట్టడంపై ఆగ్రహం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/అలంపూర్‌ చౌరస్తా : జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ రణరంగంగా మారింది. ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమం ఆగ్రహ జ్వాలగా మారింది. కంపెనీకి చెందిన కంటెయినర్‌, గుడారానికి నిప్పు పెట్టిన నిరసనకారులు.. బొలేరో, ఎర్త్‌మూవర్‌ను ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 28న గాయత్రీ రెనివబుల్‌ ప్యూయల్స్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ర్టీ్‌సను గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయి. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల పెట్టుబడితో సుమారు 100 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీలో ఈబీపీ (ఇథనాల్‌ బ్లెండింగ్‌ ప్రోగ్రాం)లో భాగంగా రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్‌ను ఇందులో ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన ఇథనాల్‌ను ప్రభుత్వానికే విక్రయించడం ద్వారా రోజూ వినియోగించే పెట్రోల్‌లో ఈబీపీ కింద కలుపుతారు. దీనివల్ల కార్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇతర దేశాల నుంచి ముడిచమురు దిగుమతికి ఖర్చు చేస్తున్న విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరికల్‌ మండలం చిత్తనూరు, కృష్ణా మండలంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీలను నిర్మించారు. అక్కడ ఉత్పత్తి కూడా జరుగుతోంది. చిత్తనూరు వద్ద ఫ్యాక్టరీ నిర్మించినప్పుడు కూడా ఇదే విధంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నెలలపాటు నిరసన తెలిపినప్పటికీ కంపెనీ ఏర్పాటు పూర్తయ్యింది. ఇప్పుడు పెద్ద ధన్వాడలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ కూడా చిత్తనూర్‌, కృష్ణాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలాంటిదే. అయితే కొన్నాళ్లుగా శాంతియుతంగానే కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న గ్రామస్థులకు అక్కడి సిబ్బంది కవ్వింపు చర్యలకు పాల్పడటం వల్లే బుధవారం పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. ఇందులో నిరసనకారుల్లో మరియమ్మ, కృష్ణ అనే వ్యక్తులకు గాయాలు కాగా కంపెనీ సిబ్బందిలో సుమారు 25 మందికి గాయాలైనట్లు నిర్వాహకులు తెలిపారు.

- కాలుష్యానికి వ్యతిరేకంగానే...

ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రాంతం తుంగభద్ర నదీ తీరంలో ఉంటుంది. అక్కడ నీటి లభ్యత అధికంగా ఉండటం వల్లే నీటి అవసరం ఎక్కువగా ఉన్న ఈ ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. అయితే కంపెనీ ఏర్పాటయితే భూగర్భజలాలు తగ్గడంతో పాటు కాలుష్యం వల్ల పంటలు పండవని, నీరు కలుషితమవుతుందని, సమీప గ్రామాల ప్రజలకు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్థుల్లో భావన ఉన్నది. వాస్తవానికి గత ప్రభుత్వంలోనే కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వచ్చినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సైతం కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావం తెలిపారు. దీంతో ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతో పనులను నిలిపివేశారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 2024 నవంబర్‌లో కంపెనీ నిర్మాణం కోసం మరోసారి ఏర్పాట్లు చేయడంతో పెద్ద ధన్వాడ సమీప గ్రామాలైన చిన్న ధన్వాడ, నసనూరు, చిన్నతాండ్రపాడు, నౌరోజి క్యాంపు, మాన్‌దొడ్డి, తుమ్మిళ్ల, పచ్చర్ల, కిష్టపురం, వేణిసోంపురం తదితర గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా మీటింగ్‌ పెట్టుకొని మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. ఆ సమయంలో మంత్రి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కలిసి కూడా విన్నవించారు.

- ప్రజాభిప్రాయ సేకరణ లేకపోవడమే...

ఏదైనా కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు దాని ఆవశ్యకత, పర్యవసానాలు, లాభాలు, నష్టాలపై సమీప గ్రామాల ప్రజల నుంచి అధికారులు, కంపెనీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. కానీ పెద్ద ధన్వాడ ఇథనాల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఈ ప్రక్రియ జరగలేదు. ఎన్నిసార్లు నిరసన తెలుపుతున్నప్పటికీ మళ్లీమళ్లీ ఏర్పాట్లు చేసుకుంటుండం సమీప గ్రామాల ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. సోమవారం రాత్రి జేసీబీ, హిటాచీలు, కంటెయినర్లను కంపెనీ పెద్దధన్వాడకు తరలించింది. రాత్రికి రాత్రే గుడారాలు కూడా వేశారు. ఆ సమయంలో గ్రామస్థుల్లో కొంతమంది పెద్దలు వెళ్లి అడగడంతో సిబ్బంది కొంత దూకుడుగా కవ్వింపు చర్యలకు పాల్పడట్లు తెలుస్తోంది. దీంతో ఆ పెద్దలు.. గ్రామాలకు వెళ్లి జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. బుధవారం శాంతియుతంగా నిరసన తెలుపుదామని ప్రయత్నిస్తే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పెద్ద ధన్వాడ, చిన్నధన్వాడ, మాన్‌దొడ్డిలో పికెట్‌ ఏర్పాటు చేశారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన ప్రజలు పొలాల నుంచి వెళ్లి కంపెనీకి చెందిన కంటెయినర్‌, బొలేరోను బోల్తా చేసి, కంటెయినర్‌, గుడారానికి నిప్పు పెట్టారు. హిటాచీ, బొలేరే అద్దాలను ధ్వంసం చేశారు. ఇందులో గ్రామస్థులతో పాటు కంపెనీ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి.. నిరసనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కంపెనీ సిబ్బంది అక్కడి నుంచి పారిపోగా పికెట్‌ పెట్టి పోలీసులు వీడియో పుటేజీ ఆధారంగా 25 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకొని రాజోలి, శాంతినగర్‌, మానవపాడు, అయిజ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అయితే కంపెనీ మాత్రం ఇది ఎకో ఫ్రెండ్లీ అని, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం ఉండదని నిబంధనల్లో ఉన్నదని చెబుతోంది. కంపెనీ ఏర్పాటు వల్ల లాభాలే త ప్పా నష్టాలు ఉండవని పేర్కొంటోంది.

ప్రజాభీష్టం మేరకే అన్నారు

పెద్ద ధన్వాడలో కంపెనీ ఏర్పాటును మేము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. గతేడాది చివరిలో కూడా కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అడ్డుకొని ధర్నా చేశాం. మంత్రి శ్రీధర్‌బాబును, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలను కూడా కలిశాం, కలెక్టర్‌ను కలిసి ఫ్యాక్టరీ పనులు చేపట్టవద్దని కోరాం. వారు కూడా ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మళ్లీ మొన్న రాత్రి వచ్చారు. ఎందుకు వచ్చారని మా ఊరి పెద్దలు అడిగేందుకు వెళ్తే కర్రలు అడ్డంవేసి దాటి చూడండి అంటూ కవ్వించారు. దీంతో రాత్రి మా ఊరితో పాటు చిన్నధన్వాడ, మాన్‌దొడ్డి గ్రామాల్లో ఆలోచించి అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం.

- కె.వెంకటేష్‌, పెద్ద ధన్వాడ, రాజోలి

చట్ట వ్యతిరేక పనులు చేస్తే చర్యలు

ప్రజలు ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించే కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలపకుండా చట్టాలను అతిక్రమించినట్లు గుర్తించాం. ఆందోళనలో పాల్గొన్న వారు కంపెనీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి. బుధవారం కంపెనీ ప్రాంతంలో జరిగిన ఆందోళనలను పరిశీలిస్తున్నాం. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారిపై చర్యలు ఉంటాయి.

- మొగులయ్య, డీఎస్పీ, గద్వాల

- కంపెనీ ఏర్పాటుతో లాభమే : మంజునాథ్‌, కంపెనీ డైరెక్టర్‌

ఇథనాల్‌ కంపెనీ వల్ల పర్యావరణానికి కానీ, పంటలు, జీవరాశులకు ఎలాంటి నష్టం జరిగే పరిస్థితి లేదు. ఇథనాల్‌ తయారీలో ఎలాంటి కెమికల్స్‌ వాడే అవకాశం ఉండదు. ఇది కేవలం బియ్యం, మొక్కజొన్నలాంటి ఆహార పదార్థాల నుంచి తయారు చేస్తారు. కంపెనీ ఏర్పాటు వల్ల 50 మందికి ప్రత్యక్షంగా, 50 మందికి పరోక్షంగా ఉపాధి దొరకుతుంది. స్థానిక గ్రామానికి ఏడాదికి రూ. కోటి అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చాం. అపోహల వల్లే ప్రజలు కంపెనీ పనులను అడ్డుకుంటున్నారు. అవకాశం ఇస్తే అపోహలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తాం.

Updated Date - Jun 04 , 2025 | 10:56 PM