ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువుల్లోకిచేరని చేపలు

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:41 PM

చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను ఎప్పుడు వదులుతారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.

పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామంలో చేప పిల్లలను విడుదల చేస్తున్న మత్స్యకారులు

- చేప పిల్లల పంపిణీపై స్పష్టత కరువు

- ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రాని ఆదేశాలు

- ఆశగా ఎదురుచూస్తున్న మత్స్యకారులు

- నగదు బదిలీ చేయాలని డిమాండ్‌

వనపర్తి, జూలై4 (ఆంధ్రజ్యోతి) : చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను ఎప్పుడు వదులుతారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్ధిక భరోసా కలిగింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి చేకూరింది. ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పథకాన్ని కొనసాగించింది. అలాగే గత ఏడాది కూడా చేప పిల్లలను పంపిణీ చేసింది. చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించేది. కానీ ఈ ఏడాది జూలై నెల వచ్చినప్పటికీ ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. టెండర్లు పిలువలేదు. దీంతో చేప పిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. పంపిణీ చేస్తారా? లేదా? అని మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో అమలుపై సందిగ్ధం నెలకొన్నది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేలకు పైగా చెరువులు, కుంటలు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఏటా 8 కోట్లకు పైగా చేప పిల్లలను వదులుతూ వస్తున్నారు. అవి పెరిగి పెద్దయ్యాక వాటిని విక్రయించి వేలాది మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఒక్క వనపర్తి జిల్లాలోనే 142 మత్స్యకారుల సంఘాలున్నాయి. వాటిల్లో 13,600 మంది సభ్యులున్నారు. వీరంతా చేపల విక్రయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్న ఫలితం ఉండటం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు రాలేదని చెప్తుండటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సకాలంలో పంపిణీ చేయాలి

జిల్లాలో ప్రతీ సంవత్సరం అదును దాటిన తరువాత చేప పిల్లలను సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ నెల వరకు పంపిణీ చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా నాలుగు రకాలైన బొచ్చ, రౌట, మోస్‌, బంగారు తీగలను వదులుతున్నారు. కానీ సరైన సమయంలో వదలకపోవడంతో చేప పిల్లలు ఎదగడం లేదు. దీంతో తమకు మేలు జరగడం లేదని చెప్తున్నారు. ఆగస్టులోపు చెరువుల్లో చేపలను వదిలితే బాగా ఎదుగుతాయని అంటున్నారు. అయితే కాంట్రాక్టర్లు కూడా నాసిరకం చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నారని, దీంతో అవి ఆశించిన మేర ఎదగడం లేదని ఆరోపిస్తున్నారు.

చేపలకు బదులు నగదు

ఉచితంగా చేప పిల్లలు పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేయాలని పలువురు మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. చేపలకు బదులుగా నగదు బదిలీ చేస్తే తామే నాణ్యమైన చేప పిల్లల్ని కొనుగోలు చేసి తెచ్చుకొని సరైన సమయంలో చెరువులు, కుంటల్లో వదులుకుంటామని చేప్తున్నారు. ఈ ఏడాది నుంచి అయినా నగదు బదిలీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని మత్స్యకారులు ఆశిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు

లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి, వనపర్తి : చేప పిల్లల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తాం. ఆ వెంటనే వాటిని చెరువుల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటాం. మా దగ్గరికి వచ్చే మత్స్యకారులకు కూడా ఇదే సమాధానం చెప్పి పంపిస్తున్నాం.

Updated Date - Jul 04 , 2025 | 11:41 PM