ఫీల్డ్ విచారణ తప్పనిసరి
ABN, Publish Date - Jun 10 , 2025 | 11:20 PM
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాసును ఫీల్డ్ విచారణ చేపట్టిన అనంతరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాసును ఫీల్డ్ విచారణ చేపట్టిన అనంతరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించి, దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు. విచారణ అనంతరం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.
15 నుంచి 30వరకు అవగాహన సదస్సులు
గిరిజనుల వికాసానికి, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అమలు చేస్తున్న పీఎం ధరతి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంపై జిల్లాలో గుర్తించిన 25 గిరిజన ఆవాసాల్లో ఈనెల 15 నుంచి 30వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అదికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. ఆధార్‌కార్డు, ఆహార భద్రత కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, కులం సర్టిఫికెట్, కిసాన్ క్రెడిట్ కార్డు, జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్ మొదల గునవి ఎంపిక చేయబడిన గిరిజన గ్రామా ల్లో దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి జనార్దన్ పాల్గొన్నారు.
పకడ్బందీగా ఇందిర సౌర గిరి జల వికాస పథకం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. అర్హత కలిగిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టేదారులను మండల స్థాయి కమిటీ ద్వారా గుర్తించి భూగర్భ జల సర్వేలను నిర్వహించి, బోరు బావులను తవ్వించాలని సూచించారు. సోలార్ సిస్టం ద్వారా మోటర్లను బిగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలు ఈనెల 16లోగా జిల్లా స్థాయి కమిటీకి సమర్పించాలన్నారు. యూనిట్ ఖర్చు రూ.6 లక్షల వరకు సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గండీడ్, మహమ్మదాబాద్, హన్వాడ, నవాబ్‌పేట్, మూసాపేట్ మండలాలలో ఆర్‌వోఎఫ్‌ఆర్ భూమి కలిగిన గిరిజన రైతులను 72 మందిని గుర్తించినట్లు తెలిపారు. జడ్పీసీఈవో వెంకట్‌రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్, వ్యవసాయాధికారి వెంకటేశ్, విషన్ భగీరథ ఈఈ పుల్లారావు పాల్గొన్నారు.
నేడు, రేపు బాలకార్మికులను గుర్తించాలి
బుధ, గురు ఈ రెండు రోజుల్లో జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. అందుకు కార్మిక శాఖ, పోలీస్, సంబంధిత శాఖలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో బాలకార్మికులు, కౌమార దశ బాల కార్మికులపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్‌పోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలు పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయాలన్నారు. బాలకార్మికులను రక్షించి స్టేట్ హోంలో చేర్పించాలని, వారికి కౌన్సిలంగ్ ఇవ్వాలని అన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
నేడు అంగన్‌వాడీ కేంద్రాల పునఃప్రారంభం
నేడు అంగన్‌వాడీ కేంద్రాలు పునఃప్రారంభం కానున్నాయని, ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరపాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. ఈనెల 10 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంపై సీడీపీవో, సూపర్‌వైజర్లకు కలెక్టర్ దిశ నిర్దేశం చేశారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.
Updated Date - Jun 10 , 2025 | 11:20 PM