మార్కెట్ కార్యదర్శిపై కాంగ్రెస్ నాయకుడి దాడి
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:38 PM
’’నేను చెబితే వినరా? నా మాటంటే లెక్కలేదా’’ అంటూ అధికార పార్టీకి చెందిన నాయకుడు ఓ అధికారి చెంపలు వాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో చాటకూలీలకు బుధవారం దుస్తులు (యూనిఫాం) పంపిణీ చేశారు.
దుస్తుల పంపిణీ విషయంలో వివాదం
నా మాటే వినరా అంటూ చితక్కొట్టిన వైస్‌చైర్మన్
కేసు నమోదు చేసిన పోలీసులు
మహబూబ్‌నగర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ’’నేను చెబితే వినరా? నా మాటంటే లెక్కలేదా’’ అంటూ అధికార పార్టీకి చెందిన నాయకుడు ఓ అధికారి చెంపలు వాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో చాటకూలీలకు బుధవారం దుస్తులు (యూనిఫాం) పంపిణీ చేశారు. మార్కెట్ వైస్ చైర్మన్ పి విజయ్‌కుమార్ లైసెన్స్ లేని కొందరికి కూడా దుస్తులు పంపిణీ చేయాలని సూచించారు. మార్కెట్ నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న వాళ్ళకే దుస్తులు పంపిణీ చేయాలని మార్కెట్ యార్డ్ ప్రత్యేక కార్యదర్శి భాస్కర్ చెప్పడంతో వైస్‌చైర్మన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ వైస్ చైర్మన్ అయిన తన మాటే వినరా అంటూ దుర్భాషలాడుతూ అతనిపై దాడిచేశారు. అధికారి చెంపలు, మెడలపై కొట్టడంతో కార్యాలయంలో ఉన్న అధికారులు, సిబ్బంది అంతా భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటికి తేరుకున్న కార్యదర్శి భాస్కర్ సిబ్బందితో కలిసి టుటౌన్ పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదుచేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై ఇష్టానుసారంగా చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. నిత్యం వైస్ చైర్మన్ వేధింపులకు గురిచేస్తారని, ఆఫీసు రూమ్‌కు తాళం వేసుకొని వెళతారని, బయటి వ్యక్తులను తీసుకువచ్చి ఆఫీసులో కూర్చోబెడతారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదుమేరకు మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌పై ఎస్సై విజయ్‌భాస్కర్ కేసు నమోదుచేశారు.
Updated Date - Jul 02 , 2025 | 11:39 PM