అభివృద్ధి దిశగా చెన్నారెడ్డిపల్లి
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:10 PM
ఇటు జిల్లా కేంద్రానికి అటు మండల కేంద్రానికి దూరంగా ఉన్న చెన్నారెడ్డిపల్లి గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.
- 14 సంవత్సరాలుగా మధ్యపాన నిషేధం
- ఊరు అభివృద్ధే అందరి నిర్ణయం
- వ్యవసాయయే జీవనాధారం
నవాబ్‌పేట, జులై 14 (ఆంధ్రజ్యోతి) : ఇటు జిల్లా కేంద్రానికి అటు మండల కేంద్రానికి దూరంగా ఉన్న చెన్నారెడ్డిపల్లి గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆ ఊరి యువత నిర్ణయం తీసుకుంటే అది శిలా శాసనమే. దాన్ని దిక్కరించే అధికారం ఎవరికీ లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సంవత్సరాలుగా సంపూర్ణ మధ్య నిషేధం అమలవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నవాబ్‌పేట మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామం గత ప్రభుత్వ హయాంలో ఇప్పటూర్ గ్రామ పంచాయతీ నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 1650 జనాభా ఉండగా, 8 వార్డులు, 872 మంది ఓటర్లు ఉన్నారు. రహదారికి ఇరువైపులా పెంటకుప్పలు, మట్టి రోడ్లు, వెలగని వీధిలైట్లు నిత్యం గొడవలతో సతమతమయ్యేవారు. ఇది గ్రహించిన యువకులు ఒక్కో పని చేసుకుంటూ నేడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ యువకులు తమవంతుగా ఆర్థిక, వస్తు సాయం చేస్తూ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, బడి పిల్లల సంఖ్య పెంచారు.
వ్యవసాయమే జీవనాధారం..
గ్రామంలో మొత్తం 1600 మందికి పైగా ఉండగా, 90శాతం మంది వ్యవసాయం, గొర్రెలు, మేకలు, పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మహిళలు సైతం తాము తక్కువ కాదన్నట్లు పూలు, కూరగాయలు విక్రయిస్తూ ఆర్థికంగా రాణిస్తున్నారు.
మధ్య నిషేధం రాష్ట్రానికే ఆదర్శం..
ఈ గ్రామం మధ్య నిషేధం అమలులో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుంది. 14 సంవత్సరాలుగా గ్రామంలో మద్యం అమ్మరాదని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు పండుగ ఏదైనా గ్రామంలో మద్యం విక్రయించరు.
Updated Date - Jul 14 , 2025 | 11:10 PM