చిగురిస్తున్న ఆశలు
ABN, Publish Date - Apr 18 , 2025 | 11:02 PM
భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం కనిపిస్తోంది. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత సాదాబైనామాల దరఖాస్తులు తీసుకున్నప్పటికీ.. ఆ పోర్టల్‌లో పరిష్కారానికి ఆప్షన్ లేకపోవడంతో దాదాపు అయిదేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు.
భూ భారతిలో సాదాబైనామాల పరిష్కారానికి హామీ
ఉమ్మడి పాలమూరులో 29,375 పెండింగ్ దరఖాస్తులు
దరఖాస్తు చేసుకొని ఐదేళ్లుగా రైతుల ఎదురుచూపులు
పరిష్కారం బాధ్యత ఆర్డీవోలకు అప్పగింత
చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత కార్యాచరణ
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం కనిపిస్తోంది. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత సాదాబైనామాల దరఖాస్తులు తీసుకున్నప్పటికీ.. ఆ పోర్టల్‌లో పరిష్కారానికి ఆప్షన్ లేకపోవడంతో దాదాపు అయిదేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. దాని అమలు కోసం పలు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆ మండలాల్లోని రెవెన్యూ గ్రామాల్లో సభలు నిర్వహించి, రైతుల నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా భూమి కొనుగోలు పద్ధతి రిజిష్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఉంటుంది. కొనుగోలు చేసిన వ్యక్తి సదరు డాక్యుమెంట్‌ను చూపించి.. అమ్మిన వ్యక్తి నుంచి భూ హక్కులను పొందుతారు. అయితే గతంలో రైతులకు రిజిష్టర్డ్ డాక్యుమెంట్లపై అవగాహన లేని సమయంలో సాదాబైనామాలు(తెల్లకాగితం)పై ఒప్పం దం చేసుకుని, భూమిని తమ స్వాధీనంలోకి తీసుకునేవారు. మోఖాపై భూమిని స్వాధీన పరుచుకున్నప్పటికీ.. కాగితాల్లో మాత్రం అమ్మినవారు మాత్రమే యజమానులుగా ఉండేవారు. అవగాహన ఉన్న వారు తహసీల్దార్ కార్యాలయాల్లో భూ హక్కులను కూడా బదలాయించుకునేవారు. కానీ అవగాహన లేమితో.. కొందరు రైతులు భూమిని మాత్రమే స్వాధీనపరుచుకునేవారు. హక్కుల బదలాయింపు జరిగేది కాదు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సాదాబైనామాల ద్వారా కొంతమంది రిజిస్ర్టేషన్లు చేసుకోగా, చాలామంది అలాగే మిగిలిపోయారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న చాలామంది రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు.
ఎల్‌ఆర్‌యూపీ తర్వాత ఇబ్బందులు..
రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రాం(ఎల్‌ఆర్‌యూపీ)ని తెచ్చింది. ఇందులో భాగంగా అన్ని రికార్డులను డిజిటలైజ్ చేయడంతోపాటు ధరణి చట్టం ద్వారా కొత్త పాసు పుస్తకాలు జారీ చేసింది. ఆ సమయంలో చాలా పొరపాట్లు జరిగాయి. భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు రావడం, ఒకరి సర్వే నెంబర్‌లోని భూమి మరొకరికి రావడం వంటివి జరిగాయి. కాస్తు కాలం ఎత్తివేయడంతో అనుభవంలో ఉన్నవారు అధికారికంగా హక్కులు కోల్పోయి, పట్టదారుల పేరుపై పాస్ బుక్కులు రావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కాస్తుదారు కాలంలో ఉన్నవారితోపాటు, సాదాబైనామాల ద్వారా ఆస్తులు కొనుగోలు చేసిన వారు కూడా తర్వాత ఇరకాటంలో పడ్డారు. భూమి అమ్మిన వారు తిరిగి అవి తమ ఆస్తులను క్లెయిమ్ చేసి.. కోర్టులకు వెళ్లడం వంటి సమస్యలు చాలా ఉత్పన్నమయ్యాయి. అప్పటి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి, 2014 జూన్ 2 రాష్ట్రం ఏర్పడేనాటి కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమిని సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసి, 12 ఏళ్లు మోఖాపై ఉన్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 10 అక్టోబరు 2020 నుంచి 11 నవంబరు 2020 వరకు ఈ దరఖాస్తులను స్వీకరించింది. అయితే ధరణిలో మాత్రం వాటి పరిష్కారానికి ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో ఐదేళ్లుగా అటు యజమానులకు, ఇటు కాస్తుదారులకు మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.
కొత్త చట్టం.. పరిష్కార మార్గం..
ధరణి వచ్చిన తర్వాత చిన్నసన్నకారు రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో సాదాబైనామాలు కూడా ఒకటి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం 29,375 మంది రైతులు సాదాబైమనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు నోచుకోకపోవడం కూడా ధరణి పట్ల విముఖతకు, దాన్ని రద్దు చేయడానికి కారణమైందని చెప్పొచ్చు. కొత్త చట్టంలో సెక్షన్ 6, రూల్ 6 ప్రకారం సాదామైనామాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 2014 జూన్ 2 కంటే ముందు సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసి, 12 ఏళ్లుగా స్వాధీనంలో ఉండటంతో పాటు గత ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకున్నవారి నుంచి ఆర్డీవోలు విచారణ చేసి.. చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. పీవోటీ, సీలింగ్, ఎల్‌టీఆర్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకున్న తర్వాత, అర్హత ఉన్న రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ర్టేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తర్వాత హక్కుల రికార్డులో నమోదు చేసి, పాసుపుస్తకం జారీ చేస్తారు. ధరణిలో సాదాబైనామాల కోసం నిబంధన లేనందున హైకోర్టు వీటి క్రమబద్ధీకరణపై గతంలో స్టే విధించింది.
Updated Date - Apr 18 , 2025 | 11:02 PM