వరంగల్ సభకు సిద్ధమైన బీఆర్‌ఎస్ నాయకులు
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:13 PM
వరంగల్ జిల్లాలో ఆదివారం జరిగే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు నారాయణపేట జిల్లా నుంచి 12 వేల మంది ప్రతినిధులను తరలించేలా మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.
- ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు సమకూర్చిన మాజీ ఎమ్మెల్యేలు
నారాయణపేట, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లాలో ఆదివారం జరిగే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు నారాయణపేట జిల్లా నుంచి 12 వేల మంది ప్రతినిధులను తరలించేలా మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, మునిసిపాలిటీల్లోని వార్డుల్లో ఉదయమే గులాబీ జెండాలు ఆవిష్కరించి, ప్రత్యేక వాహనాల్లో వరంగల్‌కు బయలుదేరనున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఆర్‌రెడ్డి ఆదివారం ఉదయం గులాబీ జెండా ఆవిష్కరించనున్నారు. నియోజకవర్గం నుంచి 35 ఆర్టీసీ బస్సులు, 120 తుఫాన్ వాహనాలతో పాటు నాయకుల సొంత వాహనాలు 5 వేల మంది ప్రతినిధులు తగ్గకుండా వరంగల్‌కు వెళ్లేలా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మక్తల్ నియోజకవర్గం నుంచి 5 వేల మంది ప్రతినిధులు తరలివెళ్లేలా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బస్సులు, ప్రైవేటు వాహనాలు సమకూర్చారు. వరంగల్ బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన స్వయంగా మక్తల్ అంతర్రాష్ట్ర రహదారిలో ఓ గోడకు వాల్‌పోస్టర్ అంటించి పార్టీ నాయకుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జిల్లాలోని కోస్గి, మద్దూర్ మండల కేంద్రాల్లో బస్సులు, గ్రామాల్లో ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకలతో బీఆర్‌ఎస్ నాయకుల్లో జోష్ నెలకొంది.
Updated Date - Apr 26 , 2025 | 11:13 PM