మాదకద్రవ్యాల నిర్మూలనపై చైతన్యవంతం చేయాలి
ABN, Publish Date - May 03 , 2025 | 11:14 PM
ప్రజలను మాదక ద్రవ్యాలపై చైతన్యవంతులను చేయాలని తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు.
- తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య
- ఎస్వీఎ్‌సలో అవగాహన సదస్సు
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం) మే 3 (ఆంధ్రజ్యోతి) : ప్రజలను మాదక ద్రవ్యాలపై చైతన్యవంతులను చేయాలని తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుచ్చయ్యతో పాటు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వాడకం రోజు రోజుకు పెరుగుతుందని, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా యువత పెడదారి పడుతున్నారని, అది ఒక వ్యసనంగా మారుతుందని చెప్పారు. ఇదిలాగే కొనసాగితే మానవతా విలువలు తగ్గిపోవడంతో పాటు కుటుంబాల విచ్ఛిన్నమై, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అందువలన ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పారు. విహార యాత్రలకు వెళ్లడంతో పాటు కుటుంబ సభ్యులతో గడపాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం నుంచి విముక్తులను చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చాలని సూచించారు. మాదకద్రవ్యాల సంబంధిత సమస్యలను నివేదించేందుకు 1908, 8712671111 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ కృష్ణ, ఎస్సైలు వీణశ్రవంతి, రఘువరణ్, ఎస్‌వీఎస్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేపీ జోషి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రోహిత్ దీక్షిత్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునిల్‌కుమార్, వైద్య, డెంటల్, నర్సింగ్, పారామెడికల్ కళాశాలల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 11:14 PM