‘అనన్య’సామాన్యం
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:22 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని చాటి చెప్తోంది అనన్యశ్రీ. మక్తల్‌కు చెందిన ఆమె, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
- ఆసియా వాలీబాల్ టోర్నీకి ఎంపిక
- భారత మహిళా జట్టులో చోటు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని చాటి చెప్తోంది అనన్యశ్రీ. మక్తల్‌కు చెందిన ఆమె, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈనెల 7 నుంచి 14 వరకు వియత్నాం హనోయ్‌లో నిర్వహించనున్న ఆసియా టోర్నీలో పాల్గొని భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది. కేరళలోని ఖేలో ఇండియా వాలీబాల్ అకాడమీ హాస్టల్‌కు ఆమె ఎంపికయ్యింది. కేరళలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో క్రీడా కోటా కింద సీటు సాధించి డిగ్రీ పూర్తి చేసింది. గత ఏడాది క్రీడా కోట కింద పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం సాధించింది. వాలీబాల్ క్రీడలో రాణిస్తున్న అనన్యశ్రీ ఇటు జిల్లా, రాష్ట్రానికి, అటు దేశానికి పేరు ప్రతిష్ఠలు తెస్తోంది.
పొడగరి బాలికలకు శిషణ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజన క్రీడల అధికారి(డీవైఎస్‌వో)గా 2017లో పని చేసిన సత్యవాణి ఆలోచన అనన్యశ్రీ జీవితాన్ని మార్చేసింది. పొడగరి బాలికలకు ప్రత్యేక క్రీడా శిక్షణ కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. మక్తల్ పట్టణానికి చెందిన ఆనంద్, వరలక్ష్మి దంపతుల కుమారై అనన్యశ్రీ 160 సెంటిమీటర్ల ఎత్తు ఉండటంతో ఈ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యింది. కోచ్ పర్వేజ్‌పాషా వద్ద రెండు నెలల పాటు శిక్షణ పొందింది. ఇలా వాలీబాల్ క్రీడలో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
అంచెలంచెలుగా ఎదిగి..
పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్‌లో 2018లో నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్ నేషనల్స్ టోర్నీలో పాల్గొన్న రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ఎంపికయ్యింది. 2019లో తమిళనాడు, 2020లో ఆంధ్రప్రదేశ్, 2022లో ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో నిర్వహించిన జాతీయ స్థాయి జూనియర్ వాలీబాల్ టోర్నీల్లో కేరళ జట్టు తరుపున ఆడి ప్రతిభ చాటింది. అస్సాంలో 2023లో నిర్వహించిన సీనియర్ వాలీబాల్ నేషనల్ టోర్నీ, పాండిచ్చేరిలో నిర్వహించిన ఫెడరేషన్ కప్ పోటీల్లోనూ సత్తా చాటింది. చైనాలో ఆగస్టులో నిర్వహించిన వరల్డ్ వాలీబాల్ యూనివర్సిటీ టోర్నీలో పాల్గొనే ఆలిండియా యూనివర్సిటీ జట్టుకు ఎంపికై తొలిసారిగా విదేశీగడ్డపై ఆడింది. గత ఏడాది జనవరిలో నిర్వహించిన ఆల్‌ఇండియా ఉమెన్స్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో పాల్గొని బంగారు పతకం సాధించింది. భారత్ తరుపున ఆడుతూ పతకాలు సాధించటమే లక్ష్యమని అనన్యశ్రీ చెబుతోంది.
Updated Date - Jun 03 , 2025 | 11:22 PM