దివ్యాగులకు ఉజ్వల ‘భవిత’
ABN, Publish Date - Jun 10 , 2025 | 11:39 PM
సమగ్ర శిక్షా సహిత విద్యా విభాగంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.
- కేంద్రాలకు ప్రత్యేక నిధులు మంజూరు
- విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి
- ప్రశస్త యాప్‌లో విద్యార్థుల నమోదు
ఖిల్లాఘణపురం, జూన్ 10(ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్షా సహిత విద్యా విభాగంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగా భవిత కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. భవిత కేంద్రాల్లో మానసిక దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల (చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్) సామర్థ్యాల పెంపునకు ఐఈఆర్‌పీలు నిరంతరం కృషి చేస్తున్నారు. భవిత కేంద్రాలకు టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం)తో పాటు భవనాల మరమ్మతులకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు.
వనపర్తి జిల్లాలో 14 భవిత కేంద్రాలు
వనపర్తి జిల్లాలో ఖిల్లాఘణపురం, కొత్తకోట, వనపర్తి మండల కేంద్రాల్లోని 3 భవిత సెంటర్లకు శాశ్వత భవనాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానంగా మరో 11, మొత్తంగా జిల్లాలో 14 భవిత కేంద్రాలున్నాయి. 16 మంది ఐఈఆర్‌పీ (ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసర్చ్ పర్సన్)లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వారు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల మానసిక స్థితి గతులను మెరుగు పరిచేందుకు, సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నారు. వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యార్జన చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం ప్రశస్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని 14 భవిత కేంద్రాల్లో 1,932 మంది పేర్లను ఈ యాప్‌లో నమోదు చేశారు. ఖిల్లాఘణపురం మండలంలో ప్రశస్త యాప్ ద్వారా 98 మంది విద్యార్థులను గుర్తించి నమోదు చేశారు.
నిపుణులతో వైద్య సేవలు
ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు భవిత కేంద్రాల్లో నిర్ధారిత రోజుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. ఐఈఆర్‌పీలు ప్రతీ శనివారం వారి ఇళ్లకు వెళ్తున్నారు. మనోధైర్యాన్ని నింపుతూ శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు మానసిక దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. వారిలో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతీ కేంద్రానికి రూ. 2 లక్షలు
వనపర్తి జిల్లాలో శాశ్వత భవనాలున్న 3 భవిత కేంద్రాలకు బోధన సామగ్రితో పాటు అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కేంద్రానికి రూ. 2 లక్షల చొప్పున రూ. 6 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో జిల్లా విద్యాధికారి సూచనల మేరకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, భవిత కేంద్రం నిర్వాహకులతో కూడిన కమిటీ పరికరాలను కొనుగోలు చేసింది. ఆయా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచింది.
మరిన్ని సేవలు అందిస్తాం
ఆనంద్, ఐఈఆర్‌పీల సంఘం జిల్లా అధ్యక్షుడు, వనపర్తి : దివ్యాంగ విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నాం. వారికి ప్రత్యేక బోధన అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. భవిత కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తే మరింత మెరుగైన సేవలను అందించడానికి క ృషి చేస్తాం.
ప్రత్యేక విద్యను అందించడమే లక్ష్యం
యుగంధర్, జిల్లా కోఆర్డినేటర్, వనపర్తి : విశిష్ట ప్రతిభావంతులైన దివ్యాంగులకు భవిత కేంద్రాల్లో ప్రత్యేక విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టీఎల్‌ఎం కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ ద్వారా శారీరక, మానసిక ఇబ్బందులను తొలగిస్తున్నాం.
Updated Date - Jun 10 , 2025 | 11:39 PM