పారదర్శకతకు పెద్దపీట
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:55 PM
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ప్రతీ అంశం పారదర్శకంగా ఉండాలని పార్లమెంట్ సభ్యుడు మల్లురవి అధికారులను ఆదేశించారు.
- పేదల జీవన ప్రమాణాల మెరుగునకు కృషి
- నిర్దేశిత లక్ష్యాలను సాధించి తీరాలి
- దిశ సమావేశంలో ఎంపీ డాక్టర్ మల్లురవి
నాగర్‌కర్నూల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ప్రతీ అంశం పారదర్శకంగా ఉండాలని పార్లమెంట్ సభ్యుడు మల్లురవి అధికారులను ఆదేశించారు. పేదల జీవన ప్రమాణాల మెరుగునకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ముందు కు తీసుకెళ్లాలన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో దేశంలోనే రాష్ట్రం ముందుండాలంటే జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పనులు, ప్రభుత్వ ప్రణాళికలు, లక్ష్యాలను అన్ని శాఖలు సాధించి తీరాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తనకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కేటాయించిన లక్ష్యం మేరకు బ్యాంకర్లు అన్ని రంగాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధించేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పని చేస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని తెలిపారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మద్దిమడుగు - మాచారం బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాల గ్రౌండింగ్‌ను పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు. వైద్య కళాశాలలో మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వివరిం చారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతున్నా యన్నారు. ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణలు తమ నియోజక వర్గాల పరిధిలో ఉన్న సమస్యలను దిశా కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో పీడీ డీఆర్‌డీఏ చిన్న ఓబులేష్, దిశ కమిటీ సభ్యులు వంకేశరం మణెమ్మ, ఎం.భగవంతురెడ్డి, వి.చిన్నయ్య, మాదవత్ మోతీలాల్, వివిధ శాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 11:55 PM