ఒకే దుకాణంలో 183 కిలోల ప్లాస్టిక్ బ్యాగ్స్
ABN, Publish Date - May 27 , 2025 | 10:52 PM
ప్లాస్టిక్‌పై చిత్తశుద్ధి ఏది? అన్న శీర్షికన రెండ్రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వ చ్చింది. అందులో అధికారు లు బడాబాబులు, హోల్‌సేల్ వ్యాపారుల జోలికి వెళ్లకుండా రోడ్లపై చిరువ్యాపారులను పట్టుకుని జరిమానాలు విధిస్తున్నారని, మూలాలను వదిలేసి చిరువ్యాపారుల మీద పడితే ప్లాస్టిక్ నిషేధం అమలు కాదని ప్రచురితమైన ఆ వార్త అక్షర సత్యమైంది.
రూ.15 వేల జరిమానా
మహబూబ్‌నగర్, మే 27(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌పై చిత్తశుద్ధి ఏది? అన్న శీర్షికన రెండ్రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వ చ్చింది. అందులో అధికారు లు బడాబాబులు, హోల్‌సేల్ వ్యాపారుల జోలికి వెళ్లకుండా రోడ్లపై చిరువ్యాపారులను పట్టుకుని జరిమానాలు విధిస్తున్నారని, మూలాలను వదిలేసి చిరువ్యాపారుల మీద పడితే ప్లాస్టిక్ నిషేధం అమలు కాదని ప్రచురితమైన ఆ వార్త అక్షర సత్యమైంది. బడాబాబుల వద్ద గుట్టలుగా ప్లాస్టిక్ బ్యాగ్‌లు మూలుగుతున్నాయని మంగళవారం నగరంలోని హస్మి బ్రదర్స్ సూపర్ మార్కెట్‌లో కార్పొరేషన్ అధికారుల తనిఖీ సందర్భంగా బయటపడింది. ఒకే దుకాణంలో 183 కిలోల ప్లాస్టిక్ బ్యాగ్‌లు బయటపడటంతో అధికారులు వాటిని ఆటోలో తరలించాల్సి వచ్చింది. చిరు వ్యాపారుల వద్దకెళ్లి కిలో, రెండు కిలోల కవర్లను స్వాధీనం చేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చే అధికారులు.. బడాబాబులు, హోల్‌సేల్ వ్యాపారుల జోలికి మాత్రం వెళ్లడం లేదన్న విమర్శలు ఇప్పటికే పెద్దఎత్తున ఉన్నాయి. ఈ దుకాణంలో యథేచ్ఛగా 120 మైక్రాన్‌ల కన్నా తక్కువ మందం గల కవర్లను వినియోగిస్తున్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని నేరుగా జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ శానిటేషన్ అధికారులు గురులింగం, రవీందర్‌రెడ్డి, వజ్రకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. తనిఖీలు చేయడానికి వెళ్లిన అధికారులకు అక్కడి వ్యాపారులు చుక్కలు చూపించారు. అధికారులు వెళ్లకుండా షెటర్లను కిందికి దించేశారు. చివరకు వారిపై ఒత్తిడి చేసి, షెటర్ తెరిచారు. దుకాణంలో తనిఖీ చేయగా, బహిరంగంగా ర్యాక్‌లో పెట్టి ప్లాస్టిక్ బ్యాగ్‌లను విక్రయిస్తున్నారు. 183 కిలోల వరకు కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొన్నింటిని వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు దుకాణం యజమానికి రూ.15 వేల జరిమానా విధించారు. ఇలా ఒక్క పెద్ద దుకాణంలోనే ఈ స్థాయిలో ప్లాస్టిక్ కవర్లు బయటపడ్డాయంటే.. నగరంలోని హోల్‌సేల్, బడా దుకాణాలన్నింటిలో తనిఖీలు చేస్తే అధిక మొత్తంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బయటపడనున్నాయి. ఈ విధంగా ప్లాస్టిక్ బయటకు వచ్చే మూలాలను కొడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే మరో దశాబ్దకాలమైనా ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టలేరన్న విషయం స్పష్టమవుతోంది.
Updated Date - May 27 , 2025 | 10:52 PM