తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:42 AM
తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తుల అరెస్టు
4.7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
సూర్యాపేటక్రైం, జూలై 9, (ఆంధ్రజ్యోతి): తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.7 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ వి. ప్రసన్నకుమార్ బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెన్‌పహాడ్ మండలంలోని మహ్మాదాపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు ఆటోడ్రైవర్‌గా పనిచేసే ఖమ్మంపాటి నాగేశ్వర్‌రావు, సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మామిడి జనార్దన్ కలిసి ఈ ఏడాది జూన్ 20 తేదీన మండల కేంద్రంలోని గుండపనేని వెంకట్రావ్ నివాసంలో తాళాలు పగలగొట్టి ఇంట్లో భద్రపరిచిన సుమారు 4.7 తులాల బంగారు ఆభరణాలు చోరీచేశారు. అదేవిధంగా ఈనెల 5న మండల పరిధిలోని దూపాడు గ్రామంలోని పత్తిపాక సైదులు నివాసంలో రూ.2 వేల నగదును అపహరించారు. చో చేసిన బంగారు ఆభరణాలను ఈనెల 9న సూర్యాపేటలో విక్రయించేందుకు కారులో బయలుదేరి సూర్యాపేటకు వెళ్తుండగా మండల పరిధిలోని అనంతారం క్రాస్‌రోడ్డు వద్ద మండల ఎస్‌ఐ గోపిక్రిష్ణ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చి కారు ఆపి తనిఖీ చేశారు. కారులోని బ్యాగులో బంగారు ఆభరణాలు లభించాయి. నేరస్తుల్లో ఒకరు పాత నేరస్తుడు కావడంతో అనుమానంతో పోలీ స్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. చోరీలకు పాల్పడింది తామేనని చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వెళ్తున్నట్లు అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద బంగారు ఆభరణాలు, కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ గురుకుల రాజశేఖర్, పెన్‌పహాడ్ ఎస్‌ఐ కస్తాల గోపిక్రిష్ణ ఉన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:42 AM