‘స్థానిక’ ఎన్నికలను వెంటనే నిర్వహించాలి
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:38 AM
స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ రూరల్, జూలై 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. పాలకులు, ప్రతిపక్ష పార్టీల తీరు ప్రజలు అసహ్యయించుకునే విధంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసేందుకు షెడ్యూల్ ప్రకటించాలన్నారు. నిరంతరంగా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు రుణాలు, రుణమాఫీ చేపట్టాలన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ ప్రణాళికను ప్రకటించి, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డబ్బికార్ మలేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, నాయకులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, సయ్యద్ హాషం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 12:38 AM