పత్తి లోడు లారీపై పిడుగు : వాహనం దగ్ధం
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:07 AM
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధమైంది.
పత్తి లోడు లారీపై పిడుగు : వాహనం దగ్ధం
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఘటన
నేరేడుచర్ల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధమైంది. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసి పలు చోట్ల పిడుగులు పడ్డాయి. అదే సమయంలో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్దకు రాగానే పిడుగు పడడంతో లారీ పూర్తిగా కాలిపోయింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం చింతపల్లిలోని కవిత కాటన ఇండసీ్ట్రస్ నుంచి రూ. 40లక్షల విలువైన 24 టన్నుల పత్తిని లారీలో లోడు చేసుకుని తమిళనాడు రాష్ట్రంలోని కోవైపట్టిలోని మహావిష్ణు స్పిన్నింగ్ మిల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చిల్లేపల్లి వద్ద పిడుగుపాటుకు దగ్ధమైంది. ఈలారీ విలువ రూ. 40లక్షలు ఉంటుందని తెలిసింది. రాత్రి 11.30 గంటల సమయంలో లారీ నుంచి వెనుక వస్తున్న వాహనదారులు డ్రైవర్‌కు విషయం చెప్పడంతో పక్కకు ఆపి చూడగా మంటలు అప్పటికే పూర్తిస్థాయిలో అలుముకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మిర్యాలగూడ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే యత్నం చేశారు. వర్షం కురుస్తున్నా, అగ్నిమాపక సిబ్బంది నీటిని చిల్లినా మంటలు ఆరలేదు. ఆదివారం సాయంత్రం వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పేందుకు యత్నించారు. ఎక్స్‌కవేటర్ సాయంతో పత్తిని తిరగేస్తూ మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చి చల్లారుస్తున్నారు. రహదారిపైనే పత్తి ఉండడంతో పొగలు వస్తూనే ఉన్నాయి. సోమవారం రాత్రి వరకు అగ్నిమాపక సిబ్బందితో పాటు చిల్లేపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా నిరంతరాయంగా వాటర్ ట్యాంకర్ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. లారీ డ్రైవర్ రాజురమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Apr 22 , 2025 | 12:07 AM