ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ngugi wa Thiong'o: సాహితీ దిగ్గజం గూగీ వా థియాంగో కన్నుమూత

ABN, Publish Date - May 30 , 2025 | 06:05 AM

ప్రఖ్యాత కెన్యా రచయిత, ప్రపంచ ప్రసిద్ధ మార్క్సిస్టు సాహితీ దిగ్గజం గూగీ వా థియాంగో (87) ఇకలేరు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..

  • కథ, నవల, నాటకం, విమర్శ తదితర ప్రక్రియల్లో అద్భుత సాహిత్యం

  • తెలుగు సాహిత్యానికీ సుపరిచితుడే

  • నోబెల్‌ స్థాయి రచయితగా గుర్తింపు

  • ఆయన రాసిన నవలా పాత్ర మీద కూడా కేసు నమోదవడం నాడు సంచలనం

  • గూగీ మృతికి సాహిత్యలోకం నివాళి

హైదరాబాద్‌ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత కెన్యా రచయిత, ప్రపంచ ప్రసిద్ధ మార్క్సిస్టు సాహితీ దిగ్గజం గూగీ వా థియాంగో (87) ఇకలేరు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 28 ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికాలోని బ్యూఫోర్ట్‌ నగరంలో తుదిశ్వాస విడిచారు. గూగీ 1938లో కెన్యాలోని కియాంబు జిల్లా కమిరితాలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల ప్రభావంతో.. విద్యార్థి దశలోనే రచనా వ్యాసంగం ప్రారంభించారు. కథ, నవల, నాటకం, విమర్శ తదితర సాహిత్య ప్రక్రియల్లో అద్భుత సృజన ఆయన సొంతం. నాడు ఆంగ్ల భాష ఆధిపత్యంపై ధిక్కార పతాకాన్ని ఎగరేశారు. తన మాతృభాష గికుయులో సాహిత్య సృజన చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. తమ దేశంలో ప్రజాస్వామ్యం కోసం నినదించారు.


కెన్యాకు స్వాతంత్య్రం వచ్చాక నాటి పాలకుల వివక్షాపూరిత పోకడలను నిరసిస్తూ ‘ఐ విల్‌ మ్యారీ వెన్‌ ఐ వాంట్‌’ నాటకం రాసి ప్రదర్శించారు. దీనితో 1977లో ఏడాది పాటు జైలు నిర్బంధంలో ఉన్నారు. ఆ సమయంలోనే టిష్యూ పేపర్‌పై ‘డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌’ నవల రాశారు. దాన్నే ప్రముఖ విప్లవకవి వరవరరావు ‘మట్టికాళ్ల మహారాక్షసి’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆయన రచనలతో పలుమార్లు నోబెల్‌ పోటీలో నిలిచారు. ఆ అవార్డు రాకున్నా... నోబెల్‌ స్థాయి రచయితగా ప్రపంచమంతా గుర్తింపు పొందారు. గూగీ రాసిన ‘ది అప్‌రైట్‌ రెవల్యూషన్‌’ కథానిక 100 భాషల్లోకి అనువాదమవడం విశేషం. కెన్యాలో తీవ్ర నిర్బంధాన్ని, అణచివేతను ఎదుర్కొన్న గూగీ.. అమెరికాకు వలస వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో కంపారిటివ్‌ లిటరేచర్‌ ప్రొఫెసర్‌గా, ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రైటింగ్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ విభాగం మొదటి డైరెక్టర్‌గా పనిచేశారు.


భారతీయులు మెచ్చిన మహా రచయిత

గూగీ వా థియాంగో నవలలు ‘బందీ’, ‘మాటిగరి’, ‘ఏడవకు బిడ్డ’ పేరిట తెలుగులోకి అనువాదమయ్యాయి. ఆయన ఆత్మకథ మొదటి భాగాన్ని ‘యుద్ధకాలంలో స్వప్నాలు- బాల్య జ్ఞాపకాలు’ పేరుతో ఆచార్య జీఎన్‌ సాయిబాబా నాగపూర్‌ జైలులో ఉన్న సమయంలో అనువదించారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో 2018 ఫిబ్రవరి 18న జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభకు గూగీ అతిథిగా హాజరయ్యారు కూడా. ఉగాండాలోని మకరెరె యూనివర్సిటీలో గూగీకి హైదరాబాదీ ప్రొఫెసర్‌ సుసీ తారు సహాధ్యాయి. అలా ఆయనకు భారతదేశంలోని దళిత, బహుజన, వామపక్ష ఉద్యమాలు, ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రతో పరిచయం ఉంది. గూగీ రాసిన మాటిగరి నవల విడుదల అనంతరం.. అందులోని మాటిగరి పాత్ర మీద కూడా కెన్యా పోలీసులు కేసు నమోదు చేయడం ఆనాడు ఒక పెద్ద సంచలనంగా నిలిచింది. గూగీ రాసిన ‘పెన్స్‌ అండ్‌ గన్స్‌’, ‘డీకాలనైజేషన్‌ మైండ్స్‌’ తదితర రచనలు కన్నడ, మలయాళ తదితర భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. గూగీతో తమకున్న అనుబంధంతోపాటు ఆయన సాహిత్య కృషిని కె.శ్రీనివాస్‌, వీక్షణం వేణుగోపాల్‌, మలుపు బాల్‌రెడ్డి, గుర్రం సీతారాములు తదితర తెలుగు సాహిత్య, సామాజిక రంగాలకు చెందిన వారంతా సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తు చేసుకున్నారు. గూగీ 1996లో భారత్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగించారు. ఆ సమయంలోనే హుస్నాబాద్‌లోని అతిపెద్ద మావోయిస్టుల స్తూపాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Updated Date - May 30 , 2025 | 06:05 AM