పట్టపగలే మట్టి దోపిడీ
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:26 AM
నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వ ము కుందాపురం సమీపంలోని 38.3 నుంచి కంపాసాగర్ ఎత్తిపోతల పథకం 39 కిలోమీటర్ల వద్ద ఎడమకాల్వ కట్టను ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగిం చి వందల ట్రాక్టర్ల మట్టిని పక్కన పొలాల్లో పోస్తున్నారు.
పట్టపగలే మట్టి దోపిడీ
సాగర్ ప్రధాన ఎడమ కాల్వ నుంచి తోలకం
వందల ట్రాక్టర్ల మట్టి తరలించి విక్రయం
పొలాల్లో కలుపుతూ కాల్వ కట్ట ఆక్రమణ
కాల్వకు పొంచి ఉన్న ప్రమాదం
అధికారులకు తెలిసినా ఆగని దందా
మట్టి బంగారమైంది. భూముల ధరలు పెరుగుదలతో చారెడు మట్టి దొరకడమే కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మట్టి మాఫీ యా నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వను కట్టనే ఏకంగా చెరపట్టింది. పట్ట పగలే వందల ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారులకు అంతా తెలిసినా ప్రయోజనం లేకుండా పోయింది.
- (ఆంధ్రజ్యోతి,త్రిపురారం)
నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వ ము కుందాపురం సమీపంలోని 38.3 నుంచి కంపాసాగర్ ఎత్తిపోతల పథకం 39 కిలోమీటర్ల వద్ద ఎడమకాల్వ కట్టను ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగిం చి వందల ట్రాక్టర్ల మట్టిని పక్కన పొలాల్లో పోస్తున్నారు. కొద్ది రోజులుగా రాత్రీ పగలు తేడా లేకుండా మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. సుమారు ఎకరం ప్రాంతంలో మట్టి డంపింగ్ చేసి అక్కడి నుంచి రవాణా చేస్తున్నారు.
మట్టి కుప్పలుగా పోసి విక్రయానికి సిద్ధం గా ఉంచారు. ట్రాక్టర్ మట్టి సుమారు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కాల్వకట్ట ఆ ప్రాంతంలో చాలా ఎత్తుగా ఉండటంతో కింద నుంచి పక్కా ప్రణాళికతో తరలిస్తున్నారు. మట్టి తీసి వేసిన తర్వాత వచ్చే ఖాళీ స్థలాన్ని పక్కన ఉన్న పొలాలు రైతులు సాగు భూమిగా మారుస్తున్నారు. మట్టి దోపిడీతో పాటు కాల్వ భూమి కబ్జాకు గురవుతోంది.ఇప్పటికే చాలా వరకు కా ల్వ కట్ట ఆక్రమణకు గురికావడంతో చివరకు కా ల్వకట్ట పది అడుగులు వెడల్పు లేకుండా పోయింది.
ప్రమాదం అంచున...
సాగర్ కాల్వ వెడల్పు సుమారు 600 అడుగులు ఉండాల్సి ఉండగా రెండు వైపులా కట్టల మట్టిని తరలించడంతో వంద అడుగుల మేర ఆక్రమణకు గురైంది. కాల్వ కట్టలు కనీసం పది అడుగుల మేర వెడల్పు లేకపోవడంతో ట్రాక్టర్లు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో కాల్వకట్ట రెండు వైపులా యథేచ్ఛగా కబ్జా జరిగింది. కాల్వకట్ట వెంట ఉన్న పొలాలు ఉన్న రైతులు ఏళ్ల తరబడి మట్టి తరలిస్తూ సాగు భూమిగా మార్చుకుంటున్నారు. కాల్వ కట్టలు బలహీన పడి గండ్లు పడే అవకాశం ఉన్నా అధికారులకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. కాల్వకు ఎలాంటి చిన్న ఉపద్రవం వచ్చినా కనీసం లారీలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఏ మేరకు ఆక్రమణలు జరిగాయే ఊహించవచ్చు. రెండేళ్ల క్రితం ముప్పారం వద్ద ఎడమ కాల్వ గండి పడితే మట్టి అందుబాటులో లేక చివరకు సుదూరంలో ఉన్న చెరువు మట్టిని తరలించడానికి అధికారులు చాలా వ్యయ ప్రయాసలు పడ్డారు. ఇంత జరిగినా అధికారుల్లో మార్పు రావడం లేదు. మట్టి తరలింపుపై అధికారులకు సమాచారం అందినా ఏమి తెలియనట్లుగా ఉన్నారంటే.. మట్టి తరలింపు వెనుక ఎవరు ఉన్నారో అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా మట్టి దోపిడీని అరికట్టి కాల్వను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మట్టి తరలింపుపై ఎడమ కాల్వ ఎన్నెస్పీ డీఈ వివరణ కోరగా అక్కడ ఎలాంటి మట్టి తరలింపు జరగడం లేదని సిబ్బంది అక్కడికి వెళ్లినపుడు రెండు ట్రాక్టర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
Updated Date - Jun 10 , 2025 | 12:27 AM