Kukatpally: గజం 2.98 లక్షల ప్లాటుకు మళ్లీ వేలం
ABN, Publish Date - Jun 25 , 2025 | 07:20 AM
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో ఇటీవల నిర్వహించిన వేలం పాటలో అత్యధికంగా గజం రూ.2.98 లక్షలకు కొనుగోలు చేసిన వ్యక్తి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అత్యధిక ధర పలికిన...
అధిక ధరకు దక్కించుకున్న వ్యక్తి వెనక్కి తగ్గడంతోనే..
పలువురి బెదిరింపులతోనే వెనకడుగు వేసినట్లు చర్చ
కేపీహెచ్‌బీలో మొత్తం 7 ప్లాట్లకు డబ్బు చెల్లించని వైనం ఆయా ప్లాట్లకు మరోసారి వేలం నిర్వహించాలని నిర్ణయం!
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో ఇటీవల నిర్వహించిన వేలం పాటలో అత్యధికంగా గజం రూ.2.98 లక్షలకు కొనుగోలు చేసిన వ్యక్తి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అత్యధిక ధర పలికిన 22వ నంబరు ప్లాటుతో పాటు మరో 6 ప్లాట్లను కొనుగోలు చేసిన వారు కూడా డబ్బు చెల్లించడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీంతో 7 ప్లాట్లకు మళ్లీ వేలం వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వేలంలో పాల్గొని, ప్లాట్లు దక్కించుకున్న వారికి బెదిరింపులు రావడంతోనే వారు వెనకడగు వేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి వేలంలో ఆ ప్లాట్లను దక్కించుకున్న మరుసటి రోజే కుటుంబ సభ్యులతో కలిసి వారు ఆ ప్లాట్లను చూడడానికి వెళ్లారు. ఆ సమయంలోనే కొందరు ‘ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. గజం రూ.2.98 లక్షలకు ఎలా కొన్నారు? ఇక్కడ అంత ధర లేదు’ అంటూ ప్లాటు దక్కించుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అత్యధిక ధరకు కొనుగోలు చేసిన వ్యక్తి హౌసింగ్ బోర్డుకు తొలుత చెల్లించాల్సిన నాలుగో వంతు డబ్బు చెల్లించడం లేదని తెలిసింది. దీంతో పాటు మరో 6 ప్లాట్లను దక్కించుకున్న వారూ వెనక్కి వెళ్లడంతో వాటికి మళ్లీ వేలం నిర్వహించాలని గృహ నిర్మాణ మండలి నిర్ణయించింది. ఈ మేరకు సంబంధితవర్గాలు కసరత్తు చేస్తున్నాయని, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది. హౌసింగ్ బోర్డు పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలకు ఇటీవల వేలం నిర్వహించారు. వీటిలో 22వ నంబరు ప్లాట్‌ను (151 గజాలు, కమర్షియల్) చదరపు గజానికి రూ.2.98 లక్షల ధరతో కొనుగోలు చేశారు. మొత్తం 18 ప్లాట్లు కలిపి 6,236.33 చదరపు గజాలను వేలం వేయగా సగటున గజానికి రూ.2.38 లక్షల ధర పలికింది. వేలం పాటలో పాల్గొని ప్లాట్లను కొనుగోలు చేసిన వారు రెండు రోజుల్లో 4వ వంతు సొమ్మును హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లింపు ప్రక్రియ సమయంలోనే ప్లాటు దక్కించుకున్నవారు వెనుదిరగడంతో మళ్లీ వేలం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Updated Date - Jun 25 , 2025 | 07:22 AM