Kishan Reddy: మూడు ‘ఎమ్మెల్సీ’లనూ గెలుచుకుంటాం
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:06 AM
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
రాజకీయాలను ఈ ఎన్నికలు మలుపు తిప్పుతాయి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుని బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. దానికి ఈ ఎన్నికలు కీలకమవుతాయని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించడంలో ప్రత్యర్థుల కంటే ముందు ఉన్నామని, ప్రచారం కూడా అదే రీతిన కొనసాగుతోందని చెప్పారు.
ఓటరు నమోదు కోసం పని చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రతీ 50 ఓటర్లకు ఒక కార్యకర్తకు బాధ్యత ఇవ్వాలన్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాకు ఒక ఇన్‌చార్జ్‌ను నియమించారు.
Updated Date - Jan 28 , 2025 | 04:06 AM