వామ్మో డెంగ్యూ...
ABN, Publish Date - Jul 31 , 2025 | 01:07 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య లెక్కలోకి రావడం లేదు. హైదరాబాద్‌కు వెళ్లి చికిత్సలు కూడా పొందుతున్నారు. మరోవైపు జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి.
- జిల్లాలో ఫీవర్ అలర్ట్
- 30 రోజుల్లోనే 4 డెంగ్యూ కేసులు..
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1890 మందికి జ్వరానికి చికిత్స
- దోమల నివారణకు వారంలో రెండు రోజులు డ్రైడే
- జిల్లావ్యాప్తంగా డెంగ్యూ లక్షణాలు, వైరల్ జ్వరాలు
- కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య లెక్కలోకి రావడం లేదు. హైదరాబాద్‌కు వెళ్లి చికిత్సలు కూడా పొందుతున్నారు. మరోవైపు జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. నిత్యం ప్రతి ఆసుపత్రిలో 150 నుంచి 300 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. చిన్నపిల్లలు జ్వరాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూన్ నెలలో 1715 మంది, జూలైలో 1890మంది జ్వరాలతో చికిత్స పొందారు. జ్వరాలతో ప్లేట్‌లెట్స్ పడిపోవడం, వైరల్ జ్వరాలైనా డెంగ్యూ లక్షణాలుగానే భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లక్షణాలతో పిల్లలు, వృద్ధులు జ్వరాలతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. తెల్ల రక్తకణాలు తగ్గిందంటే ప్రాణాలకే ప్రమాదమని భావిస్తున్న క్రమంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసరమైన ఖర్చులు కూడా వైద్యులు పెంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. 20 వేల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గితేనే డెంగ్యూ సంకేతాలుగా భావించాలని కొందరు వైద్యులు చెబుతున్నారు. 50 నుంచి 60 వేల వరకు ప్లేట్‌లెట్స్ ఉన్నా కొందరు ప్రైవేటు వైద్యులు ప్రమాదకరమంటూ హెచ్చరిస్తుండడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం డెంగ్యూ కేసులతో ప్రజలు ఆందోళన చెందుతూనే ఉన్నారు. 2021 సంవత్సరంలో 127 మంది డెంగ్యూ బారిన పడగా, 2022లో 50 మంది డెంగ్యూతో బాధపడ్డారు. 2023 సంవత్సరం 20 మంది డెంగ్యూ బారిన పడ్డారు. 2024లో 58 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గడచిన మే,జూన్, జూలై మాసాల్లో 11డెంగ్యూ కేసులను గుర్తించారు. ఈనెలలో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట మండలల్లో డెంగ్యూ కేసులు వచ్చాయి.
జిల్లాలో 14 డెంగ్యూ హైరిస్క్ ప్రాంతాలు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలలో 7 ప్రాంతాలను డెంగ్యూ హైరిస్క్ ప్రాంతాలుగా వైద్యాధికారులు గుర్తించారు. రుద్రంగి మండల కేంద్రం, వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలో గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, అల్మాస్‌పూర్, ఇల్లంతుంట మండలంలో వల్లంపట్ల గ్రామాలను గుర్తించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో భవనరుషినగర్, శాంతినగర్, బీవైనగర్, వెంకంపేట, వేములవాడ మున్సిపాలిటీలో సాయినగర్, విద్యానగర్, భగవంతరావునగర్‌లను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.
జిల్లా వ్యాప్తంగా రెండు రోజులు డ్రైడే..
సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ జ్వరాల నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, గ్రామపంచాయతీల పరిధిలో వారంలో రెండు రోజులు డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెంగ్యూపై విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డేగా పాటించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామపెద్దల సహకారంతో ఇంటింటికి వెళ్లి నిల్వ నీటిని తొలగిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచవద్దంటూ ప్రచారం చేస్తున్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నారు.
భయం వద్దు.. జాగ్రత్తలు మేలు..
జిల్లాలో డెంగ్యూ, వైరల్ జ్వరాలతో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్లేట్‌లెట్స్ తగ్గడం, రక్తస్రావం తదితర సమస్యలు గతంలో కనిపించేవి. ప్రస్తుతం మెదడు, గుండె, కాలేయం తదితర అవయవాలపై ప్రభావం చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు కూడా పెరుగుతున్నాయి. జ్వరం వచ్చిన ప్రతిసారి డెంగ్యూగా భయపడవద్దని, 90 శాతం మందిలో డెంగ్యూ కూడా మామూలు జ్వరంలాగే తగ్గిపోతుందని, సరైన చికత్స తీసుకుంటే తీవ్రమైన జ్వరం కూడా ఇబ్బంది ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. డెంగ్యూ నివారణకు ఎలాంటి టీకాలు లేవు. జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి బారిన పడకుండా చేయవచ్చు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటి తొట్టిల్లో దోమలు చేరకుండా మూతలు బిగించుకోవడం, కుండీల్లోని నీటిని తరచూ శుభ్రం చేయడం, దోమలు గుడ్లు పెట్టే పూల తొట్టిలు, పాత టైర్లు, నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
దోమల స్వైర్య విహారం..
జిల్లాలో దోమలు స్వైర్య విహారం చేస్తున్నాయి. దోమల నియంత్రణకు ప్రజలు స్ర్పేలు, లిక్విడ్‌లు ఉపయోగిస్తున్నారు. మాస్టర్ ఫీవర్, రోమన్ ఫీవర్, ఇంటర్‌మిటెంట్ ఫీవర్, ట్రాఫికల్ ఫీవర్, కోస్టల్ ఫీవర్.. ఇలా రకరకాల పేర్లతో పిలిచే చలి జ్వరాలు తెచ్చే దోమలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హడలిపోతున్నారు. ప్రధానంగా టైగర్ దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తాయి. ఎడీఎస్ దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రధానంగా పరిశుభ్రత, నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి.
డెంగ్యూ వ్యాధి లక్షణాలు...
డెంగ్యూ వ్యాధి ఎడీస్ ఈజిప్ట్ దోమ వల్ల వస్తుంది. ప్లేవీ సూక్ష్మ జీవి ద్వారా వ్యాపిస్తుంది. ఎడీస్ దోమలు పగటి పూటనే కుడుతాయి. చికెన్‌గున్యా కంటే ఎక్కువగా ఒంట్లో శక్తిని హరిస్తుంది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. డెంగ్యూ వ్యాధి జ్వర పీడితులకు తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు, చర్మం ద్వారా రక్తస్రావం, కండరాలు, కీళ్లనొప్పులు, అకలి మందగిస్తుంది. నొప్పితో కూడిన కంటి కదలికలు, వాంతులు, విరేచనాలు కూడా కలుగుతాయి.
జాప్యం చేయకుండా చికిత్స...
డెంగ్యూ లక్షణాలు కనిపించగానే జాప్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులలో తగిన వైద్య సేవలు పొందాలి. డెంగ్యూ వ్యాధి ఎలీసా పరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు.
Updated Date - Jul 31 , 2025 | 01:07 AM