నేతన్నలకు భరోసా లభించేనా..?
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:11 AM
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఏ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నిధులు కేటాయిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఏ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నిధులు కేటాయిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించి పెండింగ్‌లో పడిపోయిన ప్రాజెక్ట్‌లు, మధ్యలో నిలిచిపోయిన పనులకు మోక్షం కలుగుతుందనే ఆసక్తితో ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత సంవత్సరం నవంబరులో దేవస్థానం అభివృద్ధి పనులతో పాటు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల నేత కార్మికులు, పారిశ్రామికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న యారన్ డిపోను ప్రారంభించారు. ఇప్పటికి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీలోని మల్కపేట రిజర్వాయర్ అనుబంధ కాలువల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా గత ప్రభుత్వంలో ఏర్పాటుకు సిద్ధం చేసిన అక్వాహబ్ ప్రాజెక్ట్ పెండింగ్‌లోనే ఉండిపోయింది. మిడ్ మానేరు, అనంతారం ప్రాజెక్ట్‌ల కలయికతో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఐలాండ్ అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌లో ఏర్పాటు చేసిన జలవిహారంలో ప్రారంభించిన బోట్ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక పనులు పెండింగ్‌లోనే ఉండిపోగా, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో కొంత మేరకైనా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు.
ఫ టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధికి నిధులపై ఆశలు..
సిరిసిల్ల నేతన్నల దశాబ్దాల కల మెగా పవర్‌లూం క్లస్టర్. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మెగా క్లస్టర్‌లు ఇస్తున్నా సిరిసిల్ల నేత కార్మికులకు మాత్రం నిరాశను మిగిలిస్తూనే ఉంది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో మళ్లీ మెగా పవర్‌లూం క్లస్టర్‌పై నిరాశే మిగిలింది. ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా చివరకు నేతన్నలు చిన్నబోయే పరిస్థితి కలుగుతోంది. గతంలో వస్త్ర సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు సిరిసిల్లలో పర్యటించి టెక్స్‌టైల్ జోన్, మెగా పవర్‌లూం క్లస్టర్‌గా మార్చి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. శాశ్వత ఉపాధికి పవర్‌లూం క్లస్టర్ దోహదపడుతుందని భావించారు. కేంద్ర ప్రభుత్వం హామీలకే పరిమితమయ్యింది. తెలంగాణ ప్రభుత్వమైనా వరంగల్ తరహాలో భారీ టెక్స్‌టైల్ పరిశ్రమలకు బడ్జెట్ ఊతమిస్తారని భావించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంవత్సర కాలంగా ఒడిదొడుకులను ఎదుర్కొంది. ప్రభుత్వం దృష్టి సారించడంతో వస్త్ర పరిశ్రమపై ఆశలు చిగురించాయి. గత బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ జోన్‌ను తీసుకవస్తుందని భావించినా ఆరు గ్యారంటీల పథకాలతోనే సరిపెట్టింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో టెక్స్‌టైల్ జోన్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆశాజనకమైన కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావును సిరిసిల్లకు రప్పించిన ఎమ్మెల్యే కేటీఆర్ అప్పటి ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్‌లు మెగా పవర్‌లూం క్లస్టర్ హామీని పొందారు. అప్పటి బడ్జెట్‌లోనే ప్రకటిస్తారని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. 2004లో తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి వద్ద 60 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును రూ.7.73 కోట్లతో ఏర్పాటు చేశారు. టెక్స్‌టైల్ పార్కులో ఆఽధునిక మరమగ్గాలను స్థాపించారు. దేశవిదేశీ మార్కెట్‌లో అమ్ముడుపోయే విలువైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పార్కులోకి అనుబంధ పరిశ్రమలు రాకపోవడంతో ఉత్పత్తుల్లో మార్పులు రాలేదు. సిరిసిల్లలో లో టెక్నాలజీ మరమగ్గాలపై ఆధునిక ఉత్పత్తులు చేయలేక తరచూ పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూసింది. ఆత్మహత్యలు, సంక్షోభం నేపథ్యంలో సిరిసిల్లలో మార్పులు తీసుకరావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌ను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయి బీజేపీ ప్రభుత్వం రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 2016 బడ్జెట్ సమయంలో మంత్రి కేటీఆర్ మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి, అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగువార్‌లను కలిసి వస్త్ర పరిశ్రమ సమస్యలను వివరించారు. మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి పంపించామని తెలపడంతో ఆ బడ్జెట్‌లో పవర్‌లూం క్టస్టర్ చోటుదక్కుతుందని భావించారు. మొదటి విడతలో దేశంలో ఐదు మెగా క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా సిరిసిల్లకు చోటు దక్కలేదు. 2017 బడ్జెట్ సమయంలో అప్పుడు చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌లు చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధించుకునే విధంగా చర్యలు చేపట్టారు. కానీ ఆ బడ్జెట్‌లో కూడా మోక్షం లభించలేదు. అదేక్రమంలో 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025 కేంద్ర బడ్జెట్‌లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో సిరిసిల్ల వస్త్రోత్పత్తికి భారీగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై అవగాహన ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు ఆ దిశగా కృషి చేస్తారని భావిస్తున్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఫ ప్రభుత్వ ఆర్డర్లతో ఊరట..
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ జవసత్వాలు కోల్పోతున్న క్రమంలో ప్రభుత్వం కార్మికులకు ఉపాధిపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆర్డర్లతో కాస్త ఊరట మొదలైంది. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట రూ.350కోట్ల వరకు ఆర్డర్లను అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఆర్డర్లను నిలిపివేసింది. దీంతో పనులు లేక ఉపాధి కోల్పోయి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడింది. ఒడిదొడుకుల ప్రస్థానంలో ప్రభుత్వం స్వశక్తి మహిళల కోసం రెండు చీరలు అందించాలని నిర్ణయించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లను అందించింది. 1.30 కోట్ల స్వశక్తి చీరల ఆర్డర్లతో పాటు ఆర్వీఎంకు సంబంధించిన బట్ట ఉత్పత్తి ఆర్డర్లు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలోని బకాయిలను విడుదల చేశారు. యారన్ డిపో ద్వారా రాయితీపై నూలును అందిస్తున్నారు. వర్కర్ టు ఓనర్ పథకంలో కార్మికులకు ఉపాధి కల్పించడానికి దృష్టి పెట్టారు. కార్మికులను యజమానులుగా మార్చడానికి చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే టెక్స్‌టైల్ జోన్ కూడా ముందుకు వస్తుందని కార్మికులు ఆసక్తిగా బడ్జెట్ వైపు చూస్తున్నారు.
Updated Date - Mar 19 , 2025 | 01:11 AM