ఆక్రమణలు తొలగేదెన్నడో?
ABN, Publish Date - Jun 28 , 2025 | 01:03 AM
జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లోపల 70 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించినా కూడా ఆక్రమణలకు తొలగించడంలో నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
- ఎల్లంపల్లి ప్రాజెక్టులో 70 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించిన అధికారులు
- యథేచ్ఛగా కొనసాగుతున్న చేపల పెంపకం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లోపల 70 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించినా కూడా ఆక్రమణలకు తొలగించడంలో నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణలకు తొలగించాలని ఇరవైరోజుల క్రితమే జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించినా కూడా కిందిస్థాయి అధికారులు తొలగించడంలేదు. చేపల పెంపకం మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేపలు పడుతూ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 20వ తేదీన ఆంఽధ్రజ్యోతి జిల్లా ఎడిషన్‌లో ‘ఎల్లంపల్లిలో భూములు కబ్జా’ 200 ఎకరాల్లో చేపల చెరువుల ఏర్పాటు అనే శీర్షికన అక్రమార్కుల అక్రమ బాగోతాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ, నీటిపారుదల, సర్వే అండ్ ల్యాండ్ అధికారులతో జాయింట్ సర్వేకు ఆదేశించారు. దీంతో నీటిపారుదల శాఖాధికారులు దాదాపు పదిరోజుల పాటు సర్వే చేశారు.
ఫ ఆక్రమణలు గుర్తించిన అధికారులు..
ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిఽధిలోని పొట్యాల, అకెనపల్లి, ముర్మూర్ పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వెలుపల రైతులకు చెందిన భూములను లీజుకు తీసుకుని ప్రాజెక్టు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోకి అక్రమంగా చొచ్చుకుని లోపలికి వెళ్లి అక్రమంగా చేపల చెరువులను నిర్మించినట్లుగా గుర్తించారు. అక్రమంగా విద్యుత్‌ను వాడుకోవడంతో పాటు ఎఫ్‌టీఎల్‌కు అడ్డుగా కట్టలు వేసి, ప్రాజెక్టులోకి పైపులైన్లు వేసి నీటిని అక్రమంగా తోడుతున్నట్లు గుర్తించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములను ఆక్రమించారని అంతర్గాం పోలీస్ స్టేషన్‌లో కేసుల నమోదుకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఇది తమ పని కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకున్నారు. ఈ వ్యవహారంపై కొన్ని రోజులుగా చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆరు నెలల తర్వాత అధికారుల్లో చలనం వచ్చింది. ఈ నెల 4వ తేదీన అదనపు కలెక్టర్ డి వేణు, అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్, నీటిపారుదల శాఖాధికారులు శ్రీపాద ఎల్లంపల్లిని సందర్శించి అక్రమంగా నిర్మించిన చేపల చెరువులను పరిశీలించారు. అనుమతులు లేకుండా చేపల చెరువులను నిర్మించారని, 70 ఎకరాల ప్రాజెక్టు భూములను కబ్జా చేసినట్లుగా సర్వే ద్వారా గుర్తించామని, విద్యుత్ చౌర్యానికి గురైనట్లు గుర్తించామని అదనపు కలెక్టర్ వేణు ప్రకటించారు. ఆక్రమణలను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్న మోటార్లను నిలిపివేయాలని ఎన్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన చేపల చెరువులు నిర్మించిన వారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు సంబంధిత అధికారులు కబ్జాకు గురైన ప్రాజెక్టు భూముల్లో అక్రమంగా నిర్మించిన చేపల చెరువులను తొలగించకుండా చోద్యం చూస్తున్నారు. సాక్షాత్తు కలెక్టర్, అదనపు కలెక్టర్లు కబ్జాలను తొలగించాలని ఆదేశించినా కూడా ఇరవై రోజులైనా వాటిని స్వాధీనం చేసుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా చేపలను పట్టి బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఆక్రమణలను తరలించి ప్రాజెక్టు భూములను పరిరక్షించాలని అంతర్గాం, రామగుండం ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jun 28 , 2025 | 01:03 AM