ఈసారైనా బీ(ధీ)మా వచ్చేనా..?
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:12 AM
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురీదుతూ పంటను దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతున్న అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. పంటల బీమా పథకం అమలులోకి రాకపోవడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
- పంటల బీమా అమలుకు ప్రభుత్వం కసరత్తు
- గత ప్రభుత్వ హయాంలో పీఎంఎఫ్‌బీవైపై నిర్లక్ష్యం
- జిల్లాలో ఫసల్ బీమా అమలుకాక నష్టపోతున్న రైతులు
- ఏడాదిన్నరగా మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు..
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురీదుతూ పంటను దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతున్న అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. పంటల బీమా పథకం అమలులోకి రాకపోవడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి కన్నెర్రతో నష్టపోతున్న రైతులకు ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అందిస్తూ వచ్చింది. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీమా పథకాన్ని అటకెక్కించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆశలు కల్పించింది. మార్గదర్శకాలు జారీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులకు రెండు సీజన్లు గడిచిపోయినా ఫసల్ బీమా యోజన అమల్లోకి తేకపోవడంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీమా పథకాన్ని ముందుకు తీసుకరాకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పంటల బీమా అమలుకు మళ్లీ కసరత్తు ప్రారంభించడంతో రైతుల్లో ఆశలు మొదలయ్యాయి. బ్యాంకర్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫసల్ బీమా పథకంపై విధివిధానాలను రూపకల్పన చేయాలని చర్చించారు. దీంతో ఈసారైన బీమా పథకం అమల్లోకి వస్తుందా అని రైతులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో 11క్లస్టర్లుగా విభజించి అమలు చేయడానికి పూనుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.42 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.80 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్‌లోనూ వడగళ్ల వర్షాలు, కుంభవృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. పంట చేతికి వచ్చే దశలో రైతులకు నష్టం కలగకుండా 2016లో ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆ పథకాన్ని 2020లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది. బీమాపై అవగాహన లేకపోవడంతో రైతులు సద్వినియోగం చేసుకోలేదు.
ఫ బీమాతో రైతులకు ధీమా..
వానాకాలం, యాసంగి సీజన్లలో పంటలు వేసుకునే రైతులకు ఫసల్ బీమా యోజన ధీమాగా ఉంటుంది. పంట నీటమునిగినా, వడగళ్ల వాన, ఇసుక మేటలు వేసినా, తుఫాను ప్రభావంతో పంటలకు కలిగే నష్టాలకు బీమా వర్తిస్తుంది. బీమాకు సంబంధించి ప్రీమియంలో రైతు వాటా వానాకాలం సీజన్‌లో 2శాతం, యాసంగిలో 1.5 శాతం, వాణిజ్య ఉద్యానవన పంటలకు 5 శాతం ఉంటుంది. మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సగం చొప్పున భరిస్తాయి. ఇందులో రైతు వాటా ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. వానాకాలంలో ఐదు పంటలు, యాసంగిలో 6 పంటలకు వర్తించే యోచన కూడా చేశారు. వానాకాలంలో వరి, కందులు, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న, యాసంగిలో వరి, పప్పుదినుసులు, మొక్కజొన్న, వేరుశెనగ, మినుములు, జొన్న పంటలకు వర్తింపచేస్తారని రైతులు భావించారు. కానీ ఫసల్ బీమా యోజనపై మార్గదర్శకాలే జారీ కాలేదు. పథకం అమలైతే 2.5 ఎకరాల పంట నష్టంలో 33 నుంచి 50 శాతం వాటిల్లితే వరికి రూ.1.05 లక్షలు, మొక్కజొన్న రూ.90వేల పరిహారం అందుతుంది. జిల్లా, మండల, గ్రామాల యూనిట్‌లుగా పంటల బీమా వర్తిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఫ జిల్లాలో 1.10 లక్షల మంది రైతులకు లబ్ధి
ఫసల్ బీమా యోజన అమలుచేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.10 లక్షల మంది రైతులతో పాటు 80వేల మంది కౌలు రైతులకు కూడా ఉపయోగపడనుంది. జిల్లాలో పట్టాదారులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించే హామీలు ఇచ్చిన నేపథ్యంలో కౌలు రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జిల్లాలోని 13 మండలాలు, 171 రెవెన్యూ గ్రామాలు, 260 గ్రామపంచాయతీల పరిధిలో 83 వేల హెక్టార్‌లలో భూకమతాలు ఉన్నాయి. జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా, 2.47 ఎకరాకలకు సంబంధించి 81,416 ఎకరాలు 75,931 మంది రైతుల వద్ద ఉంది. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధించి 25,092 మంది రైతుల వద్ద 86,460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8,346 మంది రైతుల వద్ద 53,560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1,427 మంది రైతుల వద్ద 18,962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2,756 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో వానాకాలంలో 2.40 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.80 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి రెండు సీజన్‌లలోనూ 1.77 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఫసల్ బీమా యోజన అమలైతే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎదురుచూస్తున్నారు.
Updated Date - Apr 26 , 2025 | 01:12 AM