ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇళ్లు వచ్చేనా?

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:20 AM

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి నిర్మాణాలు కూడా చేపట్టి వేగవంతంగా పనులు చేస్తున్నారు.

- మంత్రి ఆదేశాలతో కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజల్లో ఆశలు

- నేతల మధ్య సమన్వయం కుదిరేనా..

- ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటయ్యేనా..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి నిర్మాణాలు కూడా చేపట్టి వేగవంతంగా పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీతోపాటు మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. దీంతో కరీంనగర్‌ నియోజకవర్గంలో ఒకవైపు ఆశలు చిగురిస్తుండగా.. మరోవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు వ్యవహారం సజావుగా సాగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీతోపాటు కార్పొరేషన్లు, పట్టణాలపై దృష్టి సారించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. స్థానికంగా కరీంనగర్‌ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఒకింత అనుమానాలకు కూడా గురిచేస్తున్నాయి.

ఫ ఏర్పాటు కాని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ

కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే కరీంనగర్‌ కార్పొరేషన్‌ కూడా ఉన్నది. కరీంనగర్‌ నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఆ కమిటీ లబ్ధిదారుల జాబితాను గుర్తిస్తేనే ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేస్తోంది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా కరీంనగర్‌ రూరల్‌ మండలంలో కొత్తపల్లిలో 230 ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. కమిటీ లేని కారణంగా మరో 3,270 ఇళ్లకు లబ్దిదారుల గుర్తింపు పూర్తికాకపోవడంతో మంజూరు ఉత్తర్వులు వెలువడలేదు.

ఫ స్పందించని మంత్రులు

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు మే 29న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉందని, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో అక్కడ 3270 ఇళ్ల మంజూరు ఇవ్వలేకపోయామన్నారు. వాటిని మంజూరు చేస్తే జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇద్దరు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ స్పందించలేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జూన్‌ 22న జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనూ ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన రాగా అధికారులు అదే విషయాన్ని మళ్లీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయనా స్పందించలేదు.

ఫ ఆధిపత్య పోరే కారణమా...?

ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ మధ్య ఆధిపత్య పోరుతోనే కరీంనగర్‌ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేకపోయారని ప్రచారం జరిగింది. జిల్లాలోని చొప్పదండి, హుజూరాబాద్‌, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించడంతోపాటు ఇళ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు చెందిన గంగుల కమలాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు సూచించినవారినే ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్‌ ఇందిరమ్మ కమిటీలకు సభ్యుల పేర్లతోపాటు మరికొన్ని పదవుల కోసం ప్రతిపాదనలు చేస్తూ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జాబితా పంపించారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా పట్టణంలోని 60 డివిజన్లలో ఇందిరమ్మ కమిటీల్లో చేర్చాల్సిన వారి పేర్లను ఇచ్చారు. వీరిలో పురుమల్ల శ్రీనివాస్‌ మంత్రి పొన్నంపై ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి కి మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుడని పేరుంది. వీరిద్దరిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సదాభిప్రాయం లేకపోవడంతో వారి ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. మంత్రులిద్దరిని సమన్వయపరిచి ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తారా అనేది వేచిచూడాలి.

Updated Date - Jul 01 , 2025 | 01:20 AM