విచ్చలవిడిగా కల్తీ
ABN, Publish Date - May 24 , 2025 | 12:38 AM
ప్రస్తుతం ప్రజలు ఎక్కువ శాతం చిరుతిండ్లకు అలవాటు పడ్డారు. ఇదే అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.
- నిబంధనలు పాటించని వ్యాపారులు
- ఆహార నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు
- జిల్లాను వెంటాడుతున్న కల్తీకాటు
- పట్టణ రెస్టారెంట్లు, బేకరీల్లో డొల్లతనం
- ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలు
- నామమాత్రంగా తనిఖీలు
జగిత్యాల, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ప్రజలు ఎక్కువ శాతం చిరుతిండ్లకు అలవాటు పడ్డారు. ఇదే అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాణ్యత లేని, కల్తీ పదార్థాలను వినియోగిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు కల్తీ పదార్థాల తయారీ ఇష్టారాజ్యంగా సాగుతుందన్న విమర్శలు అధికమవుతున్నాయి.
- గాలిలో కలుస్తున్న ఆహార భద్రత...
ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా పలు ప్రాంతాల్లో ఆహార కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని పలు హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్ పార్లర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, మెస్‌లు, వసతి గృహాలు ఇలా అన్నింటా ఇదే దుస్థితి నెలకొంటుంది. కొన్ని రోజులుగా అధికారుల తనిఖీల్లో కల్తీ, శుభ్రత, నాణ్యతలేనితనం బట్టబయలు అవుతున్నాయి. భారీ జరిమానాలు, మూసివేతలు, తగిన శిక్షలు పకడ్బందీగా అమలు కాకపోవడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని పలు హోటళ్లలో లభించే ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా మారింది.
- నిర్వాహకుల ఇష్టారాజ్యం...
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులది ఇష్టారాజ్యంగా మారింది. వివిధ వ్యాపారాలు ఏర్పాటు చేయాలంటే ఫుడ్ సేఫ్టీ ఆధారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఆహర పదార్థాల్లో పకృతి సిద్ధమైన రంగులే వాడాలి. ఆహార పదార్థాల్లో టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. కానీ ఈ నిబంధనలను బిర్యానీ సెంటర్ల వారు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
- ప్రజల ఆరోగ్యంతో చెలగాటం..
నిబంధనల ప్రకారం అన్ని రకాల హోటళ్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజి వసతి బాగుండాలి. వంట వండే వ్యక్తి వడ్డించే వ్యక్తులకు సంబంధిత హోటల్ యజమాని డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చాలా చోట్ల అమలు కావడం లేదు. పెద్ద హోటళ్లు, కొన్ని రెస్టారెంట్లు మినహా మిగితా వాటిల్లో పరిశుభ్రత పాటించడం లేదు. భోజనం, టిఫిన్ల తయారీకి నాసిరకం సరకులు, కూరగాయలు వాడుతున్నారు. మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మాంసం సైతం ఇదే విధంగా ఫ్రిజ్‌లో ఉంచి వండుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం మున్సిపల్ అధికారులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పలుమార్లు నిర్వహించిన దాడుల్లో బహిర్గతమైంది. అధిక శాతం రోడ్డుసైడ్ వ్యాపారాలు మురుగు కాలువలు, చెత్త కుప్పల పక్కన నిర్వహిస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు.
- రెండు వేలకుపైగా హోటళ్లు, దుకాణాలు
జిల్లాలో చిన్నా పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, చాట్‌లు, నూడుల్స్ షాపులు అన్ని కలుపుకుని రెండు వేలకు పైగా ఉన్నాయి. ఒక్క జగిత్యాల పట్టణంలోని చిన్నా పెద్ద కలుపుకొని సుమారు 150 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీ సంవత్సరం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈవ్యాపార సంస్థల ద్వారా అధికారులు ఏడాదికి పది శాంపిల్స్ సేకరించాలి. అయితే నెలలో కేవలం 30 నుంచి 40 శాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ తీసినప్పటికీ ల్యాబ్‌కు వెళ్లేలోగా ఆహారం కుళ్లి పోతుంది. ఫలితంగా ల్యాబోరేటరి పరీక్షల్లో కల్తీ గురించి సరైన నివేదికలు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న మధ్యతరగతి హోటళ్లలో 20 శాతానికి మించి అనుమతులు లేవన్నది బహిరంగ రహస్యంగా మారింది. కాగా ప్రతీ నెల ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ వాహనం ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా హోటల్లు, దుకాణాల్లో సేకరించిన శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ వాహనంలో ఉన్న పరికరాల ద్వారా పరీక్షించి చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
- ఆహారంలో కల్తీ...ఇబ్బందులు
పాలల్లో చిక్కదనం కోసం నాసి రకం పాల పౌడర్లు, యూరియా, పిండి, నూనె, నీళ్లు కలిపి విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. జంతువు కళేబరాల నుంచి సేకరించిన ఎముకల బట్టీల్లో అత్యధిక ఊష్ణోగ్రతపై మరిగించి తీసిన ద్రావణాన్ని వంటనూనెలో కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన జంతువు మాంసాన్ని 24 గంటలలోపే వినియోగించాలి. చాలా హోటళ్లలో చనిపోయిన జంతువుల మాంసాన్ని ఎక్కువకాలం నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. చికెన్, మటన్ బిర్యానీలు, తందూరి చికెన్‌లలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికర రంగులు వాడుతున్నారు. నిషేధానికి గురైన క్యాట్‌పిష్‌లను సైతం పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆహారాన్ని వండే సమయంలోనూ వండిన నూనెను మళ్లీ మళ్లీ కాచి వండుతున్నారు. దీంతో క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అన్ని రకాల పండ్లను ఆకర్షణీయంగా కనిపించేందుకు కార్బైడ్‌తో హానికారక రంగులు, జిగురు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దీంతో కాలేయ సమస్యలు, కడుపునొప్పి, నిద్రలేమి, కిడ్నీ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
- నిబంధనలు ఏం చెబుతున్నాయి..
ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శాఖ సూచించే నియమ నిబంధనలను వ్యాపారులు తప్పకుండా పాటించాలి. అలా పాటించని వ్యాపారులపై కేసులు పెట్టాలి. ఆహారాన్ని శాంపిల్‌గా తీసి ల్యాబ్‌కు పంపించి, అందులో ఆహారం కల్తీ అయినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే అప్పుడప్పుడు మినహా కల్తీ వ్యాపారులపై పకడ్భందీ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
- అనూష, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, జగిత్యాల
హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా నిబందనలు పాటించాలి. ఇష్టారీతిగా వ్యహరించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాము. ఎప్పటికప్పుడు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాము. అనుమానం ఉన్న ఆహార పదార్థాల శాంపిల్స్ ల్యాబ్‌కు పంపుతున్నాము. కల్తీవని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము.
Updated Date - May 24 , 2025 | 12:38 AM