పదవులు దక్కేదెవరికి?
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:20 AM
అధికార కాంగ్రెస్‌లో పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ పార్టీ అధిష్ఠానం ఆశావహులకు ఊహించని షాక్ ఇచ్చింది. 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి పెద్దపీట వేయాలని, ఆ తర్వాత పార్టీలో చేరిన వారికి తర్వాత ప్రాధాన్యం దక్కుతుందని చెప్పడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, కరీంనగర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్నవారికి ఆశాభంగం ఎదురవుతున్నది.
- కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్
- 2017 తర్వాత పార్టీలో చేరినవారికి మొండిచేయి
- పలువురు నేతలకు ఆశాభంగం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అధికార కాంగ్రెస్‌లో పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ పార్టీ అధిష్ఠానం ఆశావహులకు ఊహించని షాక్ ఇచ్చింది. 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి పెద్దపీట వేయాలని, ఆ తర్వాత పార్టీలో చేరిన వారికి తర్వాత ప్రాధాన్యం దక్కుతుందని చెప్పడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, కరీంనగర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్నవారికి ఆశాభంగం ఎదురవుతున్నది. పార్టీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నాలుగు రోజుల క్రితం గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించి ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించారు. వారిని పార్టీ గ్రామ, మండల, బ్లాక్, పట్టణ కమిటీలకు అధ్యక్షులుగా, ఇతర పదవుల్లో బాధ్యులను నియమించడానికి పేర్లను సూచించాలని, క్షేత్ర స్థాయికి వెళ్లి పార్టీకి చెందిన క్యాడర్‌తో మాట్లాడి 2017కు ముందు పార్టీలో ఉన్నవారి పేర్లను మాత్రమే పదవులకు నామినేట్ చేసేందుకు ప్రతిపాదించాలని తెలిపారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీలో ఉంటూ అధికారంలో లేకముందు పార్టీని వెన్నంటి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిలో మార్పునకు తావే లేదని ఆమె పరిశీలకులుగా నియమించినవారికి, ఇతర నాయకులకు తేల్చి చెప్పారు. దీంతో జిల్లాలో పార్టీ పదవులు ఆశిస్తున్న వారికి నిరాశే ఎదురయ్యే పరిస్థితి కల్పిస్తున్నది.
ఆశావహులందరూ కొత్త వారే..
ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్ శాసనసభ్యుడిగా ఎన్నికవడంతో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం భావిస్తున్నది. ఈ పదవి కోసం వెలిచాల రాజేందర్‌రావు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్, పత్తి కృష్ణారెడ్డి, మెన్నేని రోహిత్‌రావు, పురుమల్ల శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. వారు శాసన సభ్యులు, జిల్లా మంత్రుల వద్దకు వెళ్లి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజేందర్‌రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ కార్పొరేటర్లను, పలువురు నాయకులను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరగా, వారంతా ఆయనకు మద్దతుగా గాంధీభవన్‌కు వెళ్లి నేతలను కలిశారు. ఆశావహులంతా వారివారి పరిచయాలను బట్టి వివిధ కోణాల్లో ప్రయత్నాలు చేశారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఆశావహులుగా ఉన్నవారికి ఊహించని షాక్ ఇచ్చింది. వీరిలో రాజేందర్‌రావు, పురుమల్ల శ్రీనివాస్ ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్నారు. రాజేందర్‌రావు కాంగ్రెస్‌కు చెందినవారే అయినా మధ్యలో ప్రజారాజ్యం పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లి వచ్చారు. పురుమల్ల శ్రీనివాస్ కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లి వచ్చి మళ్లీ కాంగ్రెస్‌లో చేరినవారే. పత్తి కృష్ణారెడ్డి సీపీఎం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. రోహిత్‌రావు మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు మనుమడే అయినా ఆయన గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. వీరంతా అధిష్ఠానం కొత్తగా సూచించిన నిబంధన పరిధిలో ఇమడకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి ప్రస్తుతం పోటీలో ఉండే అవకాశం ఉన్నది. పరిశీలకులు వచ్చి పార్టీ కేడర్ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత సూచించే పేర్లలోనుంచి ఒకరిని జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు అందులో ఎవరివైపు మొగ్గు చూపుతారో అన్నది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మార్పుపై చర్చ
ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉంటున్నారు. నేతలకు పార్టీ పదువులపై ఒకరు చెప్పిన దానికి మరొకరు భిన్నంగా చెప్పే అవకాశం ఉన్నందున అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ శ్రేణులకు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పురుమల్ల శ్రీనివాస్ ఉన్నారు. ఆయనను మార్చుతామని ఎవరు అధికారికంగా ప్రకటించకపోయినా ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పురుమల్ల గళం విప్పడంతో ఆయనకు పార్టీ క్రమశిక్షణ సంఘం సంజాయిషీ కోరుతూ నోటీసు జారీ చేసింది. ఆయన జవాబు ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ నుంచి ఏ ప్రకటన రాకపోయినా నియోజకవర్గ ఇన్‌చార్జిని మార్చుతారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకున్నది. ఇది పురుమల్ల అంటే గిట్టనివారు చేస్తున్న ప్రచారమేనని, అందుకు అవకాశాలే లేవని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు.
నేతలతో పరిశీలకుల సమావేశాలు
పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని అధిష్ఠానం పేర్కొనడం పార్టీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపింది. ప్రధానంగా పదేళ్లకుగా పార్టీ కోసం సేవలందించినవారికే అవకాశమిస్తామనడాన్ని వారు స్వాగతిస్తున్నారు. జిల్లా పరిశీలకులుగా నియమితులైనవారు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహిస్తారు. అధిష్ఠానం ఇచ్చిన ఫార్మట్లలో జిల్లా అధ్యక్ష పదవి కోసం ఐదుగురి పేర్లను, బ్లాక్ అధ్యక్ష పదవి కోసం ముగ్గురి పేర్లను, మండల అధ్యక్ష పదవి కోసం ఐదుగురి పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయి అధ్యక్షుల కోసం వీరు మూడు పేర్లను ప్రతిపాదిస్తారు. పీసీసీకి ఈ ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత రాష్ట్రస్థాయిలో కీలక నేతలతో చర్చించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధిష్ఠానానికి షార్ట్ లిస్టును ప్రతిపాదిస్తారు. పదవుల నియామకాన్ని అధిష్ఠానం ఖరారు చేస్తుంది.
Updated Date - Apr 26 , 2025 | 01:20 AM