ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీలర్ల భర్తీకి మోక్షమెప్పుడో..?

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:58 AM

జిల్లాలో రేషన్‌ దుకాణాల వ్యవస్థ అస్థవ్యస్తంగా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా రేషన్‌ డీలర్ల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కొత్త రేషన్‌ దుకాణాల డిమాండ్‌, ప్రతిపాదనలకు సైతం మోక్షం లభించడం లేదు.

-జిల్లాలో ఖాళీగా 99 దుకాణాల రేషన్‌ డీలర్‌షిప్‌లు

-నిత్యావసర వస్తువుల పంపిణీలో తప్పని అవస్థలు

-కొత్తవి మంజూరుకు నోచుకోని వైనం

జగిత్యాల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌ దుకాణాల వ్యవస్థ అస్థవ్యస్తంగా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా రేషన్‌ డీలర్ల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కొత్త రేషన్‌ దుకాణాల డిమాండ్‌, ప్రతిపాదనలకు సైతం మోక్షం లభించడం లేదు. ఫలితంగా ప్రతీ నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంలో తిప్పలు తప్పడం లేదు. ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పలు పర్యాయాలు సమస్యలను అధికారులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకవెళ్లినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కొత్తగా రేషన్‌ షాపులను ప్రారంభించకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని నిరుపేదలు ఎదుర్కొంటున్నారు.

ఫజిల్లాలో పరిస్థితి ఇలా...

జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెల 592 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, మల్యాల ప్రాంతాల్లో గల పౌర సరఫరాల శాఖ గోదాములతో స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల నుంచి పలు రేషన్‌ దుకాణాలకు బియ్యం రవాణా జరుగుతోంది. జిల్లాలో 3,07,127 వివిధ కార్డుదారులుండగా వీటిలో 8,82,187 మంది కుటుంబ సభ్యులున్నారు. ఇందులో 2,92,460 ఆహార భద్రత కార్డులుండగా 8,44,755 మందికి సభ్యులుగా ఉన్నారు. అంత్యోదయ కార్డులు 14,532 ఉండగా ఇందులో 37,277 మంది కుటుంబ సభ్యులున్నారు. అన్నపూర్ణ కార్డులు 145 ఉండగా 155 మంది కుటుంబ సభ్యులున్నారు. ప్రతీ నెల 5,578 మెట్రిక్‌ టన్నుల బియ్యం వివిధ కార్డు దారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

ఫరేషన్‌కార్డుదారుల ఇక్కట్లు

జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో 99 రేషన్‌ దుకాణాల డీలర్ల ఖాళీలున్నాయి. ఇందులో జగిత్యాల రూరల్‌ మండలంలో 2, వెల్గటూరులో 2, సారంగపూర్‌లో 3, రాయికల్‌లో 10, బీర్పూర్‌లో 8, బుగ్గారంలో 2, ధర్మపురిలో 5, గొల్లపల్లిలో 2, ఇబ్రహీంపట్నంలో 4, జగిత్యాల అర్బన్‌లో 9, కథలాపూర్‌లో 2 రేషన్‌ డీలర్ల ఖాళీలున్నాయి. అదేవిదంగా కొడిమ్యాల మండలంలో 7, కోరుట్లలో 6, మల్లాపూర్‌లో 6, మల్యాలలో 6, మేడిపల్లిలో 6, బీమారంలో 4, మెట్‌పల్లిలో 7, పెగడపల్లిలో 5, ఎండపల్లిలో 3 రేషన్‌ డీలర్ల ఖాళీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 592 రేషన్‌ దుకాణాలుండగా 84 దుకాణాల డీలర్‌షిప్‌లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 493 దుకాణాలకు రెగ్యులర్‌ డీలర్లున్నారు. ఖాళీలున్న ప్రాంతాల్లో సమీపంలోని రేషన్‌ డీలర్లను ఇన్‌చార్జీలుగా కొనసాగిస్తూ సరుకులు పంపిణీ చేయిస్తున్నారు.

ఫఇన్‌చార్జీలతో ఇబ్బందులు

జిల్లాలో పలు రేషన్‌ దుకాణాలను ఇన్‌చార్జి డీలర్లతో నడిపిస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతీ నెల కనీసం పక్షం రోజుల పాటు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఒక్కో డీలరుకు రెండు, మూడు దుకాణాలు అప్పగించడంతో సరుకుల పంపిణీలో అవస్థలు ఏర్పడుతున్నాయి. సరుకుల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన సమాచారం కార్డుదారులకు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బయోమెట్రిక్‌ మిషన్లు సైతం పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్య కారణంగా పనిచేయడం లేదు. సర్వర్‌ మొరాయిస్తుండడంతో సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. రెండు ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేయడం ఇన్‌చార్జీలకు సైతం ఇబ్బందికరంగా తయారైంది.

ఫకొత్త రేషన్‌ దుకాణాల జాడేది..?

జిల్లాలో కొత్తగా రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేయడం లేదు. నిబంధనల ప్రకారం 500 నుంచి 600 రేషన్‌ కార్డులకు ఒక రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన జిల్లాలో మరో పాతిక వరకు రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా దాటిన తండాలు, గ్రామాలను పంచాయతీలుగా అప్‌ గ్రేడ్‌ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా 53 గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యాయి. కొత్తగా ఏర్పాటు అయిన పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు లేకపోవడంతో పల్లె వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రామాలకు వెళ్లి రేషన్‌ సరుకులను తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పలువురు కొత్తగా రేషన్‌ దుకాణాల మంజూరు కోసం ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు సమర్పించుకున్నప్పటికీ మోక్షం లభించడం లేదు.

కొత్త రేషన్‌ దుకాణాలు మంజూరు చేయాలి

-గాజెంగి నందయ్య, జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు

జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త రేషన్‌ దుకాణాలు మంజూరు చేయాలి. దూర ప్రాంతాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం వల్ల ఆహార భద్రతా కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్ల స్థానాలను సైతం భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

Updated Date - Apr 19 , 2025 | 12:58 AM