కందిపప్పు టెండర్లలో మతలబేమిటో...!
ABN, Publish Date - Jul 16 , 2025 | 02:03 AM
అసలే నిధుల కొరతతో రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్న నిధులను ఆచితూచి ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తుంటే అందుకు విరుద్ధంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అసలే నిధుల కొరతతో రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్న నిధులను ఆచితూచి ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తుంటే అందుకు విరుద్ధంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇందుకు అంగన్‌వాడీ కేంద్రాలకు ఖరారు చేసిన కందిపప్పు టెండర్లే నిదర్శనం. తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను కాదని అడ్డగోలు ధరకు ముగ్గురు కాంట్రాక్టర్లకు టెండర్ కట్టబెట్టిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు మాసాల నుంచి బహిరంగ మార్కెట్లో కిలో కంది పప్పు ధర 95 నుంచి 105 రూపాయలు పలుకుతుండగా, అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 10 నుంచి 11 టన్నులు, ఏడాదికి 120 నుంచి 132 టన్నుల వరకు సరిపడా కంది పప్పును కిలోకు 152 రూపాయల చొప్పున సరఫరా చేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలను, కాంట్రాక్టర్లు కోట్ చేసిన ధరలను మధ్యే మార్గంగా పరిశీలించి టెండర్‌ను ఖరారు చేయాల్సిన అధికారులు అత్యధిక ధర చెల్లించడం విచిత్రంగా ఉంది. దీంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం గాకుండా చూడాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నాలుగు మాసాలకు సరఫరా అయిన పప్పు మీద అదనంగా కాంట్రాక్టర్లు డబ్బులు దండుకున్నారు. అడ్డగోలు ధరలకు టెండర్ కట్టబెట్టడంలో ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫ 706 కేంద్రాలకు కంది పప్పు సరఫరాకు టెండర్లు..
జిల్లాలో గల 706 అంగన్‌వాడీ కేంద్రాలకు ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకు కంది పప్పు సరఫరా చేసేందుకు కలెక్టర్ ఈ ఏడాది మార్చి 27వ తేదీన టెండర్లను ఆహ్వానించారు. నిజామాబాద్‌కు చెందిన వాసవి మోడ్రన్ దాల్‌మిల్, హైదరాబాద్‌కు చెందిన విజయ ఏజెన్సీస్, శ్రీసాయికృష్ణ ట్రేడర్స్ సుల్తానాబాద్‌కు చెందిన బీఎం ట్రేడర్స్, వరంగల్‌కు చెందిన శివ సాయి ట్రేడర్స్ యజమానులు టెండర్లు దాఖలు చేశారు. వాసవి మాడ్రన్ మిల్ యజమాని కిలో కందిపప్పు 147.82 రూపాయలు, విజయ ఏజెన్సీస్ యజమాని 152 రూపాయలు, శ్రీసాయి కృష్ణ ట్రేడర్స్ 124.52 రూపాయలు, బీఎం ట్రేడర్స్ యజమాని 131.95 రూపాయలు, శివసాయి ట్రేడర్స్ యజమాని 149 రూపాయలకు సరఫరా చేస్తామని ధరలు కోట్ చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నటువంటి జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ) తక్కువ ధర కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు గాకుండా 152 రూపాయలకు కిలో చొప్పున కంది పప్పు సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలోని 305 అంగన్‌వాడీ కేంద్రాలకు వాసవి మాడ్రన్ దాల్‌మిల్‌కు, మంథని ప్రాజెక్టు పరిధిలోని 196 అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ ఏజెన్సీస్‌కు, రామగుండం ప్రాజెక్టు పరిధిలోని 205 అంగన్‌వాడీ కేంద్రాలకు శ్రీసాయికృష్ణ ట్రేడర్స్‌కు కంది పప్పు సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఫ అత్యధికంగా కోట్ చేసిన ధరకే కాంట్రాక్టు..
టెండర్ల నిబంధనల ప్రకారం తక్కువ ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లకు టెండర్ ఇవ్వాల్సి ఉండగా, నిబంధనలకు పాతర వేసినట్లుగా కనబడుతున్నది. టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అత్యధికంగా కోట్ చేసిన ధరకే ముగ్గురు కాంట్రాక్టర్లకు టెండర్ కట్టబెట్టడం ఇక్కడి అధికారులకే చెల్లిందనే విమర్శలు వస్తున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా డీపీసీ వ్యవహరించినట్లుగా కనబడుతున్నది. ఐదుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేస్తే అందులో అతి తక్కువ శ్రీసాయికృష్ణ ట్రేడర్స్ యజమాని కిలో కంది పప్పు ధర 124.52 రూపాయలు కోట్ చేయగా, బీఎన్ ట్రేడర్స్ యజమాని 131.95 రూపాయలు కోట్ చేశారు. కానీ వీరిలో తక్కువ ధర కోట్ చేసిన శ్రీసాయికృష్ణ ట్రేడర్స్‌కు, బీఎన్ ట్రేడర్స్ గానీ టెండర్ ఖరారు చేయాల్సి ఉండగా అలా జరగలేదు. విజయ ఏజెన్సీస్ దాఖలు చేసిన టెండర్ ప్రకారం కిలో కంది పప్పు 152 రూపాయల చొప్పున ముగ్గురు కాంట్రాక్టర్లకు మూడు ప్రాజెక్టులను కట్టబెట్టారు. వాసవి మోడ్రన్ దాల్‌మిల్ 147.82 రూపాయలు కోట్ చేస్తే, అదనంగా 4.18 రూపాయలు, శ్రీ సాయికృష్ణ ట్రేడర్స్‌కిలోకి 124.52 రూపాయలు కోట్ చేస్తే, అదనంగా 27.48 రూపాయలు చెల్లించే విధంగా టెండర్ ఇచ్చారు. తక్కువ ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లకు ఎక్కువ ధర చెల్లించే విధంగా టెండర్ కట్టబెట్టడం ఏ జిల్లాలో కూడా జరగలేదు. హైదరాబాద్ జిల్లాలో కిలో కంది పప్పుకు 118 రూపాయలు, సూర్యాపేట జిల్లాలో 122.22 రూపాయలు, ఖమ్మం జిల్లాలో 131 రూపాయలకు టెండర్ ఇచ్చారు. పెద్దపెల్లి జిల్లాలో ఏకంగా కిలోకు 152 రూపాయలకు టెండర్ ఇవ్వడం ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు గండికొట్టినట్లు అవుతున్నది. మార్కెట్ ధరలను, వ్యాపారులు టెండర్‌లో కోట్ చేసిన ధరలను పరిశీలించి మధ్యే మార్గంగా టెండర్ ఇవ్వాల్సి ఉండగా, అత్యధిక ధర కోట్ చేసిన వ్యాపారి టెండర్‌కు అనుగుణంగా తక్కువ ధరలకు టెండర్లు దాఖలు చేసిన వారికి టెండర్ కట్టపెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే స్పందించి కందిపప్పు టెండర్లను పునఃపరిశీలన చేసి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా సంక్షేమ శాఖాధికారి వేణుగోపాల్‌ను వివరణ కోరగా కంది పప్పు టెండర్లు పారదర్శకంగా సాగాయని, నాణ్యమైన పప్పునే అందించేందుకే కలెక్టర్ ముగ్గురు కాంట్రాక్టర్లకు సరఫరా చేసేందుకు టెండర్ ఖరారు చేశారని తెలిపారు.
Updated Date - Jul 16 , 2025 | 02:03 AM