పాఠ్య పుస్తకాలు అందేదెన్నడో..?
ABN, Publish Date - Jul 04 , 2025 | 01:09 AM
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
జగిత్యాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులకు అందాల్సిన ఇంటర్ పాఠ్య పుస్తకాలు కస్తూర్బా విద్యాలయాల్లో ఇప్పటి వరకు అందలేదు. విద్యార్థినులు చదివేందుకు, అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థమయ్యేందుకు పాఠ్య పుస్తకాలు కీలకం. ఈనెల ఒకటో తేదీ నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభం కాగా, పుస్తకాలు లేక ఏ పాఠం విన్నామో, ఏం చదవాలో, రాయాలో అర్థం కాక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 15 కేజీబీవీ కళాశాలల్లో ఇంటర్ విద్య కొనసాగుతోంది. ఇందులో 1,100 మంది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులున్నారు.
ఫపాత పుస్తకాలతోనే సర్దుబాటు
కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. దీంతో కొన్ని చోట్ల పాత పుస్తకాలను సర్దుబాటు చేశారు. ఒకరిద్దరికి కలిపి చదువుకొమ్మని అధ్యాపకులు చెబుతున్నారు.
ఫకొత్త కేజీబీవీల్లో మరిన్ని అవస్థలు..
కొత్తగా ఇంటర్ ప్రవేశపెట్టిన కేజీబీవీల్లో పుస్తకాలు లేక బోధన ముందుకు సాగడం లేదు. సందేహాలు నివృత్తి చేసుకోలేని పరిస్థితిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మరో 120 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో జగిత్యాల జిల్లాలో 16 కేజీబీవీలు ఉండగా ఏడు కేజీబీవీలు కళాశాలలుగా పనిచేస్తున్నాయి. వీటికి తోడు ప్రస్తుత విద్యా సంవత్సరం ఐదు పాఠశాలలు ఇంటర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో మొత్తం 12 కేజీబీవీలో ఇంటర్ విద్యా బోధన జరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ధర్మపురి, కథలాపూర్, మల్లాపూర్, మల్యాల, మేడిపల్లి కేజీబీవీలను ఇంటర్ కళాశాలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ కళాశాలల్లో పుస్తకాల జాడ కనిపించడం లేదు.
ఫఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం..
గత యేడాది ఇంటర్ ఫలితాల్లో కస్తూర్బా విద్యాలయాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈసారైనా ప్రత్యేక కార్యాచరణతో బోధన చేపట్టాలని అధికారులు భావించారు. కానీ పుస్తకాలు ఇంతవరకు రాకపోవడంతో ఫలితాలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. కేజీబీవీలకు పాఠ్య పుస్తకాలు రాలేదన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని, జిల్లాకు అవసరమైన ఇండెంట్ గతంలో పంపించామని, ముద్రణలో ఆలస్యం కారణంగా జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారులు అంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పాఠ్య పుస్తకాల ఇబ్బంది లేదు
-ఎర్ర రజిత, ప్రత్యేకాధికారి, కేజీబీవీ, ఇబ్రహీంపట్నం
కేజీబీవీ కళాశాలలో పాఠ్య పుస్తకాల ఇబ్బంది ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ యేటా జూలై, ఆగస్టు వరకు కళాశాలకు అందుతాయి. బోధనలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.
Updated Date - Jul 04 , 2025 | 01:09 AM