క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తాం
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:18 AM
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతీయ క్రీడా పాఠశాలను వచ్చే విద్యాసంవత్సరంలోపు ఇంటర్ వరకు అప్‌గ్రేడేషన్ చేయనున్నామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.
కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతీయ క్రీడా పాఠశాలను వచ్చే విద్యాసంవత్సరంలోపు ఇంటర్ వరకు అప్‌గ్రేడేషన్ చేయనున్నామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఒలంపిక్ డే రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాట్స్ చైర్మన్ ఒలంపిక్ టార్చ్‌ను వెలిగించి జెండా ఊపి రన్ ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 2024 వరకు తెలంగాణను పాలించిన ప్రభుత్వం క్రీడలకు 350 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ సంవత్సరంలో క్రీడలకు 850 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి క్రీడలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అవగాహనను తెలిపరిచిందన్నారు. క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ పథకాల సాధనే లక్ష్యమైన ఒలంపిక్ స్ఫూర్తిని యువతలో రగిలించాల్సిన అవసరం ఉందన్నారు. మరో అతిథి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలో ఉన్న క్రీడా వనరులను సద్వినియోగం చేసుకొని జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. అంతకుముందు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో కోచ్‌లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం మొండయ్య, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి వేణుగోపాల్, ఒలంపిక్ సంఘ ప్రతినిధులు గసిరెడ్డి జనార్దధన్ రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి, తుమ్మల రమేశ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మెస్‌ను తనిఖీ చేసి కాంట్రాక్టర్ సరైన రీతిలో విద్యార్థులకు ఆహారం అందించేలా చూడాలని డీవైఎస్‌వో వి శ్రీనివాస్‌గౌడ్‌కు సూచించారు.
Updated Date - Jun 21 , 2025 | 12:18 AM