బధిర విద్యార్థులకు అండగా ఉంటాం..
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:39 AM
బధిర విద్యార్థులకు అండగా ఉంటూ వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించారు.
భగత్‌నగర్, జూలై 15(ఆంధ్రజ్యోతి): బధిర విద్యార్థులకు అండగా ఉంటూ వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బధిర విద్యార్థులకు కుట్టు మిషన్, కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రస్తుతం ముగ్గురు వొకేషనల్ టీచర్లను కేటాయించామన్నారు. విద్యార్థులకు ముందుగా పిల్లో కవర్స్, బ్యాగ్స్ వంటి సులువైన వస్తువులను కుట్టించడం నేర్పించాలన్నారు. బధిర విద్యార్థులతో సంభాషించే విధంగా 100 మందికి సైన్ లాంగ్వేజీలో శిక్షణ ఇస్తామన్నారు. టీచర్లు, ఇన్‌స్ట్రక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఈ లాంగ్వేజీపై తొలుత శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను సందర్శించి వారి నోట్ పుస్తకాలను, చేతి రాతను పరిశీలించారు. తరగతి గదులు, పాఠశాల ఆవరణలో మంచి పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. ఇక్కడి సైన్స్ ప్రయోగశాలను ఆధునికంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వొకేషనల్ కోర్సుల కోసం అవసరమైన వస్తువులు సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు.
ఫ చేప పిల్లల ఉత్పత్తిపై జీవశాస్త్ర విద్యార్థులకు అవగాహన కల్పించాలి
కరీంనగర్ అర్బన్: చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియను, ఉత్పత్తి దశలను జీవశాస్త్రం చదివే విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మానేరు జలాశయం సమీపంలో నిర్వహిస్తున్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. తల్లి చేపల నుంచి పిల్లల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల సభ్యులు ఎవరైనా పీఎంఎంఎస్‌ఎస్‌వై పథకం ద్వారా చేపల చెరువులు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. మత్స్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరాన్ని శిక్షణకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 12:39 AM