కేసీఆర్ ఆదేశాలను పాటిస్తాం
ABN, Publish Date - May 26 , 2025 | 12:42 AM
బీఆర్‌ఎస్ ప్రజాస్వామ్య పార్టీ, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. కేసీఆర్ తమ నాయకుడు ఆయన ఆదేశాలను పాటిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
- లేఖ కాకుండా వ్యక్తిగతంగా చెప్తే బాగుండు
- కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగనర్ రూరల్, మే 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రజాస్వామ్య పార్టీ, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. కేసీఆర్ తమ నాయకుడు ఆయన ఆదేశాలను పాటిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ శివారు 20వ డివిజన్ ఆరపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు రాసిన లేఖపై ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత తమ అభిప్రాయాన్ని బహిరంగ లేఖ రాయడం కాకుండా కేసీఆర్‌కు వ్యక్తిగతంగా విషయాలను చెప్పి ఉంటే బాగుండేదన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. కవిత పార్టీ పెట్టడం అనేది ఊహాగానాలే అని కొట్టి పడేశారు. ఎన్నారైల ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరవుతున్నట్లు తెలిపారు. అమెరికాలో ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యేలందరూ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీన న్యూయార్క్‌లో బీఆర్‌ఎస్ ప్రిలిమినరీ సమావేశం ఉంటుందని సుమారు 12 రోజుల పాటు పర్యటన ఉంటుందని తెలిపారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ
కరీంనగర్ పట్టణంలోని 20వ డివిజన్‌లో స్మశానవాటిక నిర్మాణానికి 15వ ఫైనాన్స్ నిధుల నుంచి సుమారు 49.50లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులకు, ఆరపల్లి నుంచి రాణిపూర్, నగునూర్ దుర్గామాత ఆలయానికి వెళ్లే దారిలో సాధారణ నిధుల ద్వారా సుమారు 12లక్షల రూపాయలు వెచ్చించి కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్‌లు తుల బాలయ్య, జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 12:42 AM