పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..
ABN, Publish Date - May 22 , 2025 | 12:55 AM
నీడ లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నెల రోజుల్లోగా ప్రారంభించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.
ఎల్లారెడ్డిపేట, మే 21 (ఆంధ్రజ్యోతి) : నీడ లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నెల రోజుల్లోగా ప్రారంభించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మండలంలో రెండో విడత కింద మంజూరైన 643 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వు పత్రాలను స్థానిక ఓ ఫంక్షన్‌హాలు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగంలతో కలిసి బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని అన్నారు. ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడత వారిగా రూ.5 లక్షలను మంజూరు చేస్తోందనిన్నారు. ఇళ్ల నిర్మాణాలకు పెట్టుబడి లేని పేదలకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని అన్నారు. నెలరోజుల్లో నిర్మాణాలు ప్రారంభించాలని లేని పక్షంలో మంజూరైన ఇళ్లు రద్దు అయ్యే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తోందని, నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో నిధుల మంజూరుకు లబ్ధిదారులు అధికారులు, దళారులను ఆశ్ర యించవద్దని స్పష్టం చేశారు. నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పనులను వేగవంతం చేసి ఇందిరమ్మ ఇంటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. కార్యక్రమంలో గృహా నిర్మాణ శాఖ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్‌బేగం, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, తహసీల్దార్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:56 AM