బోధనలో నాణ్యత పెంచేలా..
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:10 AM
జగిత్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సర్కారు బడుల్లో బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాల స్థాయిలో పటిష్టమైన పునాదులు వేయడానికి బోధనలో కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జిల్లావ్యాప్తంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
- రేపటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
- వచ్చే యేడాది ఫిబ్రవరి వరకు నిర్వహణ
- వందశాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చర్యలు
- ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- జిల్లాలో 824 ప్రభుత్వ పాఠశాలలు
జగిత్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సర్కారు బడుల్లో బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాల స్థాయిలో పటిష్టమైన పునాదులు వేయడానికి బోధనలో కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జిల్లావ్యాప్తంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులల్లో పేర్కొన్నారు. 2024-25 ఎఫ్‌ఎల్‌ఎన్ అసెన్‌మెంట్‌లో నిర్మాణాత్మక సమావేశాలతో విద్యార్థుల అభ్యసనంలో పురోగతి సాధించారు. ఈనెల 26వ తేదీ నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం...
ఫ వందశాతం హాజరు జరిగేలా...
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 824 ఉన్నాయి. ఇందులో సుమారు 57,552 మంది విద్యార్థులున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 3,750 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల పాటు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల (ఎంఈవో) పర్యవేక్షణలో నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు వందశాతం హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతీ కాంప్లెక్స్ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్‌లో కాంప్లెక్స్ హెచ్‌ఎం ఆధ్వర్యంలో మీటింగ్ మినట్స్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరైన టీచర్లకు మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ జనరేట్ చేయబడుతుంది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులకు వీటిని చేరవేయాల్సి ఉంటుంది.
ఫ 40 మందికి మించకుండా..
కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించే సమయంలో ప్రతీ గదిలో 40 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల పరిధిలో ఐఎఫ్‌సీ ప్యానెళ్లు, సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలు, టీఎల్‌ఎం ఉపాధ్యాయ హ్యాండ్ బుక్కులు, వర్క్‌బుక్స్, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా... లేదా నిర్ధారించుకోవాల్సి ఉంది. సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా, కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల సేవలను ఉపయోగించుకోవాలని జీవోలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో పిల్లల పురోగతి, ఉత్తమ పద్ధతులు, వాటికి సంబంధించిన పూర్తి డేటాతో హాజరు కావాల్సి ఉంది.
ఫ నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి...
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిరంతర వృత్తి పరమైన అభివృద్ధికి ఒకవేదికగా పనిచేస్తాయన్న అభిప్రాయాలున్నాయి. బోధనలో నాణ్యత పెరగడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలను బలోపేతం చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఉపాధ్యాయుల అనుభవాలను పంచుకోవడం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, భాగస్వామ్య అభ్యాసన సంస్కృతిని పెంపొందిస్తుంది. ఒకటి నుంచి ఐదు తరగతులను నిర్వహించే అన్ని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) పాఠశాల సముదాయ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల బోధనకు అంతరాయం కలగకుండా మొదటి రోజు 50 శాతం, రెండో రోజు మిగితా ఎస్‌జీటీలు హాజరు కావాల్సి ఉంది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతులను నిర్వహిస్తున్న అన్నిపాఠశాలల సహాయకులు (స్కూల్ అసిస్టెంట్లు), భాషా పండితులు (ఎల్‌పీ) సంబంధిత సబ్జెక్టు పాఠశాల సముదాయ ప్రాంగణాల్లో నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొదటి రోజు బాషా, రెండో రోజు బాషేతర టీచర్లు రావాల్సి ఉంటుంది. ప్రతీనెల రెండు కాంప్లెక్స్ సమావేశాలకు ఎంఈవోలు రెండు సార్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. సమావేశాల్లో ఉపాధ్యాయుల సూచనలను డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి ఎస్‌సీఈఆర్టీ సమగ్ర శిక్ష శాఖలకు పంపించాలి. ప్రతీనెల 28వ తేదీన నిర్వహించే జిల్లా సమీక్ష సమావేశంలో కాంప్లెక్స్‌లో తమ దృష్టికి వచ్చిన అందరి అభిప్రాయాలను సీహెచ్‌ఎం, ఎంఈవోల ద్వారా డీఈవో సేకరించి సమాచారం అందించాల్సి ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి చేశాం
- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి, జగిత్యాల
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రేపటి నుంచి జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించనున్నాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి, ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతులకు సంబంధించి ప్రైమరీ, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాలకు వందశాతం, హాజరయ్యేలా జాగ్రత్తలు వహించాము. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు, వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో 25వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి.
Updated Date - Jul 25 , 2025 | 01:10 AM